తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శాసనమండలిలో కంటతడి పెట్టిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందడానికి ముందు రోజు ఆమె ఓ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, అవమానించారన్న కవిత మాటలు ఆమెకు రాజకీయంగా ఎంత మేలు చేస్తుందన్నదానిపై ఇప్పుడు చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కవిత ఆవేదనతో మాట్లాడారా? లేక రాజకీయ ఎజెండాతో వ్యవహరించారా? చెప్పలేము కానీ ఈ ఘటన ప్రభావం ప్రస్తుతానికి పెద్దగా కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌కు మరీ ఎక్కువ నష్టం కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీలు ఒక అస్త్రంగా వాడుకోవడం ద్వారా బీఆర్‌ఎస్‌ను చికాకు పెట్టవచ్చు.
తెలంగాణ ఉద్యమంలో కవిత క్రియాశీలక భూమిక పోషించిన మాట వాస్తవం. ‘తెలంగాణ జాగృతి’ పేరుతో సాంస్కృతిక చైతన్యం తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారు. దసరా సందర్భంలో గ్రామ గ్రామాన బతుకమ్మ పండగ జరుపుకోవడంలో కవిత కృషి ఉంది. అలాగే నిజాం నాటి సాహిత్యాన్ని, చరిత్రను గ్రంధస్తం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ టిక్కెట్‌పై నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండోసారి ఓడిపోయినా ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఇలా.. తెలంగాణ ఉద్యమంలో భాగమైనందుకు ఆమెకు కొంతమేర ప్రతిపలం ముట్టినట్లే. నిజానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఆరంభించినప్పుడు కవిత, ఆమె సోదరుడు తారక రామారావులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
2004 ఎన్నికలలో టీఆర్‌ఎస్ గణనీయమైన విజయాలు సాధించడం, కేసీఆర్ కేంద్ర మంత్రి కావడం, మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో కలిసి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చేరడం, వైఎస్ కేబినెట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు మంత్రులు అయ్యారు. ఆ తరువాతి కాలంలోనే కేటీఆర్, కవితలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కేసీఆర్‌తో తొలినాళ్ల నుంచి ఉన్నది మేనల్లుడు హరీష్ రావే. ఇందుకు అనుగుణంగానే ఎమ్మెల్యే కాకపోయినా హరీష్‌కు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కింది. లోక్ సభ, అసెంబ్లీకి రెండు చోట్ల పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్ కేంద్ర మంత్రి కావడంతో సిద్దిపేట అసెంబ్లీ సీటు హరీష్‌రావుకు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనే ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేసీఆర్ ఆ తర్వాత రోజుల్లో అసెంబ్లీకి పోటీచేసినా సిద్దిపేటను మాత్రం హరీష్‌కే కేటాయించారు. అలాగే తన కుమారుడు కేటీఆర్‌కు సిరిసిల్ల సీటు ఇచ్చారు. 2009లో మొదటిసారి పోటీ చేసినప్పుడు కేటీఆర్ అతి కష్టమ్మీద తక్కువ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ప్రజలలో పట్టు పెంచుకుని ఆ సీటును ఆయన కాపాడుకుంటున్నారు.
2014లో కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాని 2019లో ఓటమి చెందడంతో ఆమె రాజకీయంగా కొంత వెనుకబడవలసి వచ్చింది. అయితే తండ్రే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఎమ్మెల్సీ కాగలిగారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్య గ్యాప్ ఉందని వార్తలు వచ్చాయి. 2023లో పార్టీ ఓటమి పాలయ్యాక ఇవి బహిర్గతమయ్యాయి. ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లడం పార్టీకి కొంత మైనస్ అయింది. కేటీఆర్, హరీష్ రావులు ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలూ చేశారు. కవిత జైలునుంచి బయటకు వచ్చాక ఏదో గిల్టీతో ఉన్నట్లు అనిపించేది. పైకి బింకంగానే కనిపించినా, తనను పార్టీలో దూరం పెడుతున్నారన్న భావనకు గురయ్యే వారు. హరీష్ రావు, కేటీఆర్‌లపై కొంత వ్యతిరేకత ఏర్పడింది.
తండ్రి తనను పెద్దగా పట్టించుకోవడం లేదని, కేటీఆర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తిలో ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ పక్షాన గట్టిగా నిలబడి పోరాడవలసిన సమయంలో ఆమె తొలుత హరీష్‌పైన,ఆ తర్వాత కేటీఆర్‌పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో హరీష్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆ రాజీనామాను కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పెండింగులో పెట్టడంతో ఆ అవవకాశాన్ని వాడుకుని కౌన్సిల్‌లో కవిత భావోద్వేగంతో కంట తడిపెట్టి ప్రసంగం చేశారు. నిజానికి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అయినా రాజీనామా సందర్భం కనుక ఆమె స్పీచ్ ను గుత్తా అనుమతించి ఉండవచ్చు. పైగా అదేమీ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేది కాదు. ఆ సందర్భంగా కేసీఆర్‌పైన, బీఆర్‌ఎస్‌పైన ఆమె గట్టి ఆరోపణలే చేశారు. ఏకంగా ఆ పార్టీకి నైతిక అర్హత లేదని ఆరోపించారు. తనది ఆస్తి గొడవ కాదని, ఆత్మగౌరవ పోరాటమని ప్రకటించారు.
కాళేశ్వరం,తదితర ప్రాజెక్టుల నిర్మాణ తీరును తప్పుపట్టారు. ఒక్క కాంట్రాక్టర్‌కే రూ.లక్ష కోట్ల కాంట్రాక్ట ఇచ్చారని ఆరోపించారు. ఇవన్ని ఇంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం విచారణ కూడా చేయించింది. అయినా కేసీఆర్‌పైన లేదా ఇతరత్రా ఎవరిపైన ఇంకా కేసు పెట్టలేదు. కాని కవితే ఈ రకంగా కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం నైతికంగా కరెక్టేనా అని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభ్యంతరం చెబితే ఒక అర్థం ఉండేది.అలాకాకుండా ఇప్పుడు ఏవేవో మాట్లాడితే కాంగ్రెస్ కు మేలు చేస్తుంది తప్ప తనకు కాదన్న సంగతి ఆమెకు తెలియదని చెప్పలేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్‌లోని కొందరు ప్రముఖులతో రాజకీయ సంబంధాలు పెట్టుకుని ఆమె బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఆమె ప్రభుత్వంలో కొన్ని పనులు కూడా చేయిస్తున్నారన్నది బీఆర్‌ఎస్ వర్గాల అనుమానం.
అంతేకాక అధికారంలో ఉన్నప్పుడు ఆమె వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరిగేదని, అయినా కేసీఆర్ కుమార్తె కావడంతో తాము ఏమీ మాట్లాడ లేకపోయేవారమని ఆ వర్గాలు చెబుతున్నాయి. వ్యాపార సంస్థల వారిని ఆమె బెదిరించేవారని కొందరు ఆరోపిస్తుంటారు. రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాని ఇప్పుడు సొంతంగా పార్టీ పెడితే నెగ్గుకు రాగలరా? అన్నదే చర్చ. అందులోను హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి పోటీచేయాలని ఆమె భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో కవిత రాజకీయం నల్లేరు మీద బండిగా ఉండబోదన్నది ఎక్కువ మంది భావన. ఎంత వాగ్దాటి ఉన్నా, పార్టీ అనే పెద్ద వ్యవస్థ ఉంటేనే ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం అవుతోంది. బీజేపీ వైపు వెళ్లే చాన్స్ కాస్త తక్కువగానే కనిపిస్తోంది. బిజెపి ప్రభుత్వమే తనను జైలులో పెట్టించిందన్న కోపం ఆమెకు ఉంటుంది.
కాంగ్రెస్‌లో చేరితే చెప్పలేం కాని, సొంతంగా పార్టీ అయితే మనుగడ అంత తేలికకాదు. ఈలోగా బీఆర్‌ఎస్‌తో రాజీ కుదిరుతుందా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. ఈమె రాజకీయ ప్రచారం వల్ల బీఆర్‌ఎస్‌కు జరిగే నష్టాన్ని అంచనా వేసుకుని మధ్యవర్తులు ఆ ప్రయత్నాలు చేసే అవకాశమూ ఉంటుంది.ప్రస్తుతానికి అయితే కవిత భవిష్యత్ రాజకీయం వల్ల తాము నష్టపోతామని బీఆర్‌ఎస్ అనుకోవడం లేదు. అందువల్లే ఆ పార్టీ మహిళా నేతలు కవిత విమర్శలకు ధీటుగానే బదులు ఇచ్చారు. కవిత కీలుబొమ్మగా మారారని, ఆమె వైఖరి వల్లే కేసీఆర్ మానసిక క్షోభకు గురి అవుతున్నారని పేర్కున్నారు. మండలిలో ఆమె పచ్చి అబద్దాలు చెప్పారని వారు విమర్శించారు.
అంటే బీఆర్‌ఎస్‌తో సంబంధాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్న మాట. రాజకీయాలలో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


