అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి | Alluri Maredumilli Encounter Full Details | Sakshi
Sakshi News home page

అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Nov 18 2025 10:16 AM | Updated on Nov 18 2025 11:26 AM

Alluri Maredumilli Encounter Full Details

సాక్షి, అల్లూరి జిల్లా: మారేడుమిల్లి టైగర్‌జోన్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. మృతుల్లో అ‍గ్రనేత ఒకరు ఉన్నారని ఆయన తెలియజేయగా.. అది మడావి హిడ్మానే అనే ప్రచారం ఊపందుకుంది.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం అందడంతో టైగర్‌జోన్‌ ఏరియాలో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం(6-7గం. మధ్య) ఇరు వర్గాలు ఎదురుపడి కాల్పులకు దిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో(ఎక్సేంజ్‌ ఆఫ్‌ ఫైర్‌) మావోయిస్టులు ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

మృతుల్లో హిడ్మా?
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో.. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా, ఆయన భార్య హేమతో పాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారన్నది ఆ ప్రచార సారాంశం.  హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది. చనిపోయింది మడావి హిడ్మానేనా.. అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే గనక మావోయిస్టు ఉద్యమం పని అయిపోయినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎర్రబోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సెర్చ్‌లో భాగంగా ఎర్రబోర్ అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులను ముట్టడించాయి. ఈ క్రమంలోనే వారి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే కాల్పుల్లో కొందరు మావోయిస్టులు గాయపడినట్ల సమాచారం అందుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ధృవీకరించారు. అయితే.. కాల్పులు జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, పాల్గొన్న బలగాల సంఖ్య వంటి కీలక వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement