కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోగా.. ప్రయాణికుల్లో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్, క్లీనర్‌తో కలిపి 31 మంది అని) కూడిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్ మధ్య గోర్లతు గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది.
Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999
— Naik Kartik (@mekartiknaik) December 24, 2025
ప్రమాదం జరిగిందిలా..
క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ట్రక్కు చెడిపోవడంతో రోడ్డు పక్కన డ్రైవర్ ఆపాడు. వెనకాల నుంచి వచ్చే వాహనాలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు.. ఒక్కసారిగా ట్రక్కును ఢీ కొట్టింది. డీజిల్ ట్యాంక్ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ అలాగే ట్రక్కు డ్రైవర్‌తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయినట్లు తెలుస్తోంది.

అయితే ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. సహాయక చర్యలు ముగిశాకే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.


