భువనేశ్వర్: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలుగు మావోయిస్టు కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు కూడా ఉండటం గమనార్హం.
వివరాల ప్రకారం.. ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్‌ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామం. గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్‌పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


