గణేశ్ ఉయికే (ఫైల్)
మరో ముగ్గురు మావోయిస్టులు కూడా..
పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒడిశాలో గణేశ్ బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుస ఎన్‌కౌంటర్లు..లొంగుబాట్లతో వెనక్కి తగ్గిన మావోయిస్టుల సాయుధ పోరాటానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే (69) మరణించారు. నల్లగొండ జిల్లాచండూరు మండలం పుల్లెంల ఆయన స్వగ్రామం.
ఎస్‌ఓజీ ఆపరేషన్‌లో..: ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల సాయుధ పోరాటంపై నిర్బంధం పెరిగింది. దీంతో పదిమంది లోపు సభ్యులతోనే దళాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం–కందమాల్ జిల్లాల సరిహద్దులో చకపాద పోలీస్‌స్టేషన్ పరిధిలో రంభా అడవుల్లో కీలక మావోయిస్టు నేత ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒడిశాలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపట్టే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ), సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ జవాన్లతో కూడిన 23 మంది సభ్యుల జాయింట్ టాస్‌్కఫోర్స్ బృందం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది.
గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. అర్ధగంట పాటు పలుమార్లు కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత ఘటనా స్థలిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఏకే 47, రెండు ఇన్సాస్‌లు, 303 తుపాకీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
మూడు రోజుల ఉత్కంఠ
ఒడిశా కేడర్‌కు చెందిన 22 మంది మావోయిస్టులు ఈ నెల 23న మల్కన్‌గిరిలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఆ మరుసటి రోజు కందమాల్ జిల్లాలో గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు రాకేశ్, అమృత్ చనిపోయారు. వీరిలో ఒకరు పార్టీ సరఫరా వ్యవస్థలో కీలకమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లభించిన వివరాల ఆధారంగా సమీప అడవుల్లో గురువారం గాలింపు చర్యలు చేపట్టగా, మరో నలుగురు మావోలు మృత్యువాత పడ్డారు. అందులో ఒక మహిళా మావోయిస్టుతోపాటు గణేశ్ ఉయికే కూడా ఉన్నారు.
44 ఏళ్ల పాటుఅజ్ఞాత జీవితం
రాజేశ్ తివారీ, చమ్రుదాదా, రూపా అనే ఇతర పేర్లతోనూ అజ్ఞాతంలో గణేశ్ పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.1.20 కోట్ల రివార్డు ఆయనపై ఉంది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఆయుధం పట్టిన గణేశ్ దాదాపు 44 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ఒడిశాతోపాటు కేకేటీ (కేరళ, కర్ణాటక, తమిళనాడు), ఎంఎంసీ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్), దండకారణ్యం జోన్లలో ఆ పార్టీ విస్తరణకు ఆయన కృషి చేశారు.
జగదల్‌పూర్‌లో మొట్టమొదట ఆర్గనైజర్‌గా పనిచేశారు. 1990లో సౌత్ బస్తర్ జిల్లా కమిటీ సభ్యునిగా ఫీల్డ్ వర్క్ చేశారు. ఆ తర్వాత వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా (డీసీఎస్) 2003 వరకు పనిచేశారు. ఆపై పార్టీ ఆయన్ను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి (ఎస్‌జెడ్‌సీ) తీసుకుంది. తర్వాత సౌత్ జోన్ బ్యూరోకు (రీజినల్ కమిటీ) ఇన్‌చార్జ్ అయ్యారు. 2017లో కేంద్ర కమిటీలోకి వచ్చారు.
దక్షిణ బస్తర్ ప్రాంతంలో గోండు భాషలో(దేవనగరి లిపి) ఆయన పలు పత్రికలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గిరిజనులకు అర్థమయ్యేలా జిల్లా స్థాయి, ప్రాంతీయ స్థాయిలో ఆ పత్రికలను నిర్వహించారు. తద్వారా గిరిజనులను ఉద్యమంవైపు నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు.
ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా దండకారణ్యం కేంద్రంగానే కొనసాగింది.పార్టీలోనే ఆయన హుస్నాబాద్‌కు చెందిన శారదను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పార్టీని వీడి 2007లో బయటకు వచ్చారు. ఆ తరువాత హన్మంతు మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
ఒడిశాలో పార్టీ ఖతం?
కరోనా తర్వాత మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒడిశాలోని ఏవోబీతోపాటు కందమాల్, కలహంది, కోరాపూట్, గంజాం జిల్లాల్లో మావోయిస్టులకు పట్టుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏవోబీ బాధ్యతలు చూస్తున్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితోపాటు మరో కీలక నేత చైతో మరణించారు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఒడిశా బాధ్యతలు చూస్తున్న గణేశ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
‘గణేశ్ మరణంతో ఒడిశాలో మావోయిస్టు పార్టీ వెన్ను విరిగింది. ఇక్కడితో మా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోయినట్టే’అని ఆ రాష్ట్ర డీజీపీ యోగేశ్ బహదూర్ ఖురానీయా గురువారం మీడియాతో అన్నారు. ‘మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారేందుకు అడుగు దూరంలో ఒడిశా నిలిచింది. 2026 మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం’అని ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌యూ నుంచి..
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ గణేశ్‌ది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. 1961లో జని్మంచిన హన్మంతు 7వ తరగతి వరకు స్వగ్రామమైన పుల్లెంలలో చదువుకున్నాడు. చండూరులో పదో తరగతి వరకు, ఇంటర్ నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీలో చేరారు.
1983లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే హన్మంతు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో (ఆర్‌ఎస్‌యూ) పనిచేశారు. డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేని అజ్ఞాతంలోకి వెళ్లారు. నల్లగొండ ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులోనూ హన్మంతు నిందితుడిగా ఉన్నాడు. డిగ్రీ చదివే సమయంలో ఆర్‌ఎస్‌యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన హన్మంతు మావోయిస్టు పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారు.
తల్లిదండ్రులు చనిపోయినప్పుడు...
విద్యార్థి దశ నుంచే మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హన్మంతు ఆ తర్వాత ఇంటికి వచ్చింది లేదు. తల్లిదండ్రులు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఒక్కసారి కూడా రాలేదని గ్రామస్తులు చెప్పారు. నాలుగేళ్ల కిందట ఆయన తండ్రి చంద్రయ్య, రెండేళ్ల కిందట తల్లి ఎట్టెమ్మ మృతి చెందారు. అయినా హన్మంతు వారిని చివరిసారిగా చూసేందుకు కూడా రాలేదు. కుటుంబ సభ్యులకు హన్మంతు ఎక్కడ ఉన్నది తెలియదు. హన్మంతు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. వారు శుక్రవారం ఒడిశాకు బయలుదేరే అవకాశముంది.
మా అన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు
మా అన్న నా చిన్నతనంలోనే ఉద్యమంలోకి పోయాడు. చిన్నప్పుడు చూశాం. ఆ తర్వాత ఎక్కడకు పోయిండు. ఎక్కడ ఉంటుండు అనేది మా కుటుంబానికి తెలియదు. మా అన్న వస్తాడని అమ్మానాన్న ఎంతో కాలం ఎదురు చూశారు. కానీ, వారు చనిపోయినప్పుడు కూడా రాలేదు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హన్మంతు మృతి చెందాడనే విషయం నాకు తెలియదు. – హన్మంతు పెద్ద తమ్ముడు అశోక్
మావోయిస్టు కేంద్ర కమిటీ ఖాళీ !
ఆ సభ్యులే లక్ష్యంగాకగార్ ఆపరేషన్లు
ఈ ఏడాది 11 మంది ఎన్‌కౌంటర్, ఐదుగురు సరెండర్
ప్రస్తుతం నామ్ కే వాస్తేగా మారిన కేంద్ర కమిటీ ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాయుధ విప్లవ పోరాట పంథాను అనుసరించే పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పార్టీలు విలీనమై 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పాటైంది. ఆరంభంలో ఆ పార్టీ థింక్‌ట్యాంక్, పెద్దతలగా పేర్కొనే సెంట్రల్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 42గా ఉండేది. అయితే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఆ పార్టీ థింక్ ట్యాంక్ ఖాళీ అయ్యే పరిస్థితి ఎదురైంది.
యాక్టివ్‌గా ఉంది నలుగురే..
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆ పార్టీ కేంద్ర కమిటీలో కేవలం ఆరుగురే మిగిలి ఉన్నారు. అందులో ముప్పాళ్ల లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, మిసిర్ బెహ్రా పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వీరే కాకుండా పసునూరి నరహరి, మల్లా రాజిరెడ్డి వంటి తెలంగాణ నేతలతోపాటు జార్ఖండ్‌కు చెందిన తుపాన్‌దా అలియాస్ అనల్‌దా సెంట్రల్ కమిటీలో ఉన్నారు.
ఇందులోనూ ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లా రాజిరెడ్డి వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. వీరిద్దరినీ మినహాయిస్తే కేంద్ర కమిటీలో నలుగురు నేతలే ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందులో ఇద్దరు పొలిట్‌బ్యూరోలో, మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.
లొంగుబాట్లు..
పోతుల సుజాత అలియాస్ కల్పన, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పార్టీకి ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇలా కాకుండా ఆయుధాలు, తమ వెంట ఉన్న కేడర్‌తో లొంగిపోయిన మావోయిస్టుల్లో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతోపాటు రామ్‌ధేర్ ఉన్నారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుల్లో రావుల శ్రీనివాస్, హరిభూషణ్æ, అక్కిరాజు హరగోపాల్, కటకం సుదర్శన్ ఉన్నారు.
కగార్‌తో నష్టాలు..
ఆపరేషన్ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో 2024 ఆగస్టులో చివరిసారిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. ఇందులో మడ్వి ఇడుమా (హిడ్మా)తో పాటు తక్కళ్లపల్లి వాసుదేవరావును కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత దాడుల ఉధృతి పెరిగింది. సెపె్టంబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఈరోజు వరకు ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్. ఇందులో ఇడుమా (హిడ్మా) స్థాయి కలిగిన ఆదివాసీ మహిళా మావోయిస్టు నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశం కావడం వీలు కాలేదు. 2025 ఏప్రిల్‌లో శాంతి చర్చల ప్రతిపాదన దశలోనూ కేంద్ర కమిటీ సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించాలని మావోయిస్టులు డిమాండ్ చేసినా కేంద్రం అంగీకరించలేదు.
విస్తరణ కష్టమే..: ఆ పార్టీకి చెందిన వేర్వేరు రాష్ట్ర కమిటీల్లో కీలక నేతలు ఉన్నారు. అయితే, తీవ్ర నిర్బంధం మధ్య కొత్త వారిని కేంద్ర కమిటీలోకి ప్రమోట్ చేయడానికి కనీసం మావోయిస్టులు సమావేశమై, చర్చించు కునే పరిస్థితులు లేవు. దీంతో కేంద్ర కమిటీని విస్తరించడమనేది ఆ పార్టీకి కలగా మారింది. చివరకు ఆ పార్టీ చీఫ్‌గా తిప్పిరి తిరుపతిని ఎన్నుకున్నామని కొందరు చెప్పగా.. అలాంటిదేమీ లేదని మరికొందరు మావోయిస్టులు అంటున్నారు.


