సాక్షి, రాయ్‌గఢ్: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందినవారంతా కొంటా ఏరియా కమిటీ సభ్యులుగా నిర్ధారణ అయ్యింది. అలాగే.. బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
కొంటా డివిజన్ కిస్తారామ్ అడవుల్లో మావోయిస్టులు తలదాచున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో మావోయిస్టులు ఎదురు కాల్పులకు దిగగా.. బలగాలు ప్రతి కాల్పులు జరిపాయి. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మరణించారు.
మరణించిన మావోయిస్టుల్లో మావోయిస్టు కీలక నేత, కమిటీ సభ్యుడు సచిన్ మగ్దూ ఉన్నారు. దీంతో.. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు భావిస్తున్నారు. మూడు ఏకే47 తుపాకులతో పాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో INSAS వంటి ఆటోమేటిక్ ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చి 31వ నాటికి మావోయిస్టు ఉద్యమం లేకుండా చేయాలని కేంద్రం డెడ్‌లైన్ విధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతోనే ఆపరేషన్ కగార్‌ను ఉధృతం చేసింది.
ప్రతీకారం తీరినట్లే!
సుక్మా జిల్లాలో డీఆర్‌జీ సిబ్బంది భారీ విజయాన్ని సాధించారనే చెప్పొచ్చు. కిందటి ఏడాది జూన్‌లో కొంటా ఏఎస్పీ ఆకాష్‌రావు గిర్పుంజే మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు బలయ్యారు. పొలీస్ స్టేషన్ పరిధిలో ఆయన గస్తీ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ బ్లాస్ట్‌లో కొంటా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ (టిఐ) ఎస్‌డీపీవో కూడా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో హతమైన సచిన్ మగ్దూ కమిటీనే కావడం గమనార్హం.



