శ్రీనివాసపురం: పుట్టిన వారానికే పసిగుడ్డు అనాథ అయిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం జరిగింది. అస్సాం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన ఫరీజా(22), రెహమాన్(28) స్థానికంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 15 రోజుల కిందట చేరారు. వారం క్రితం ఫరీజా ఆడశిశువుకు జన్మనిచ్చింది.
ఆదివారం ఉదయం శిశువు గట్టిగా ఏడుస్తుండడం గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో భార్యాభర్తలు శవాలై పడి ఉన్నారు. పక్కనే పురుగుల మందు సీసా ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.


