ప్రేమ విఫలం కావడంతో బలవన్మరణం
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్‌కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు.
నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్‌తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్‌తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది.
ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


