టవర్ ఏర్పాటయ్యే చోటుకు పిల్లలు సహా తరలివచ్చిన గ్రామస్తులు
తొలి మొబైల్ టవర్ రాకతో గ్రామస్తుల సంబరాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్ట్ ప్రభావిత బిజాపూర్ జిల్లా మారుమూలనున్న కొండపల్లి గ్రామంలో మొదటిసారిగా మొబైల్ టవర్ ఏర్పాటైంది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి మొన్నమొన్నటి వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు. తెలంగాణ సరిహద్దులకు సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పల్లె రోడ్డు, విద్యుత్, తాగునీటి వసతి ఇటీవలి వరకు లేనేలేవు.
గత వారం ఈ ఊళ్లో మొబైల్ టవర్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం సాంకేతికపరమైన ముందడుగే కాదు, బయటి ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలకు ఓ గుర్తని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బస్తర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ క్యాంపునకు ఈ గ్రామం సమీపంలోనే ఉంది. టవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే కొండపల్లి గ్రామంలోని వారు పండగ చేసుకున్నారు.
వారంతా కలిసి ఊరేగింపుగా నృత్యాలు చేసుకుంటూ మండార్ డోలు శబ్దాల మధ్య కోలాహలంగా టవర్ ఏర్పాటయ్యే ప్రాంతానికి చేరుకున్నారు. వీరికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తోడయ్యారు. మొబైల్ టవర్ ఏర్పాటుతో ఇప్పుడా గ్రామ ప్రజలు బ్యాంకింగ్ సేవలు, ఆధార్, రేషన్ కార్డు, ఆరోగ్య పథకాలు, పింఛను, విద్యా సేవలకు దగ్గరయ్యారని ప్రభుత్వం తెలిపింది.
2024 డిసెంబర్‌లో కొండపల్లి సమీపంలో భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటయ్యాక, శిథిలావస్థకు చేరుకున్న రోడ్డును పునరుద్ధరించారు. మొత్తం 50 కిలోమీటర్ల పొడవైన రహదారి పనులు ఇంకా కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. రెండు నెలల క్రితమే ఆ గ్రామానికి మొదటిసారిగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు.
దీంతో, చిన్నారుల చదువు, చిన్న వ్యాపారులు సహా పలు విషయాల్లో గ్రామస్తులు జీవన విధానమే సమూలంగా మారిపోయింది. బస్తర్ ప్రాంతంలోని బిజాపూర్ సహా ఏడు జిల్లాల పరిధిలో 403 గ్రామాల్లో వివిధ ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం అమలవుతున్నాయని ప్రభుత్వం వివరించింది.గత రెండేళ్లలో ఇక్కడ 728 మొబైల్ టవర్లు ఏర్పాటు కాగా, మరో 449 టవర్లను 2జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ చేశారని తెలిపింది.


