మావోయిస్టు పార్టీకి బిగ్‌షాక్‌.. దేవన్న లొంగుబాటు?! | PLGA Commander Devanna Aka Barsa Deva Think About Surrender | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పార్టీకి బిగ్‌షాక్‌.. దేవన్న లొంగుబాటు?!

Dec 2 2025 12:14 PM | Updated on Dec 2 2025 12:14 PM

PLGA Commander Devanna Aka Barsa Deva Think About Surrender

హిడ్మా(ఎడమ).. దేవన్న(కుడి.. పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగలనుందనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత, పీఎల్‌జీఏ నెంబర్‌ -1 కమాండర్‌ బార్సే దేవా అలియాస్‌ దేవన్న లొంగిపోబోతున్నట్లు ప్రచారం ఉధృతంగా నడుస్తోంది. తన దళం.. భారీగా ఆయుధాలతో సహా ఆయన లొంగిపోతారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. 

ఆపరేషన్‌ కగార్‌లో.. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్‌వాంటెడ్‌ మడివి హిడ్మా కిందటి నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలను దేవన్న ​స్వీకరించారనే ప్రచారం ఒకటి ఉంది. అయితే దండకారణ్యంలో తీవ్ర నిర్బంధాన్ని ఆయన దళం భరించలేకపోతోందన్నది ఆ ప్రచార సారాంశం. 

ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం.. ఎన్‌కౌంటర్‌లలో మరణించడం.. జనవరి 1వ తేదీన భారీ సంఖ్యలో లొంగుబాటులు ఉంటాయని మావోయిస్టు నాయకత్వం నుంచి  ప్రకటన వెలువడడం.. తదితర పరిస్థితుల నడుమ దేవన్న సైతం లొంగిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

బార్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా( ఛత్తీస్‌గఢ్‌)  పూవర్తి గ్రామం. హిడ్మా దేవన్నలది ఒకే ఊరు.. పక్కపక్కనే నివాసాలు కూడా!. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్‌జీఏ నెంబర్‌ -1 కమాండర్‌ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్‌.  అప్పటి నుంచి ఈ గ్రూప్‌తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత ప్రైజ్‌మనీ ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర _రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. ఓ పక్క నేటి నుంచి పీఎల్జీఏ 25 వ వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ.. బార్సే దేవా లొంగుబాటు గనుక నిజమైతే మావోయిస్టు పార్టీకి ఇక ఏమాత్రం కోలుకోలేని దెబ్బ అనే చెప్పొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement