breaking news
sukuma
-
మావోయిస్టు పార్టీకి బిగ్‌షాక్.. దేవన్న లొంగుబాటు?!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగలనుందనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత, పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోబోతున్నట్లు ప్రచారం ఉధృతంగా నడుస్తోంది. తన దళం.. భారీగా ఆయుధాలతో సహా ఆయన లొంగిపోతారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.ఆపరేషన్ కగార్‌లో.. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్‌వాంటెడ్ మడివి హిడ్మా కిందటి నెలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలను దేవన్న స్వీకరించారనే ప్రచారం ఒకటి ఉంది. అయితే దండకారణ్యంలో తీవ్ర నిర్బంధాన్ని ఆయన దళం భరించలేకపోతోందన్నది ఆ ప్రచార సారాంశం. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం.. ఎన్కౌంటర్లలో మరణించడం.. జనవరి 1వ తేదీన భారీ సంఖ్యలో లొంగుబాటులు ఉంటాయని మావోయిస్టు నాయకత్వం నుంచి ప్రకటన వెలువడడం.. తదితర పరిస్థితుల నడుమ దేవన్న సైతం లొంగిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బార్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా( ఛత్తీస్‌గఢ్) పూవర్తి గ్రామం. హిడ్మా దేవన్నలది ఒకే ఊరు.. పక్కపక్కనే నివాసాలు కూడా!. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచి ఈ గ్రూప్‌తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత ప్రైజ్‌మనీ ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర _రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. ఓ పక్క నేటి నుంచి పీఎల్జీఏ 25 వ వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ.. బార్సే దేవా లొంగుబాటు గనుక నిజమైతే మావోయిస్టు పార్టీకి ఇక ఏమాత్రం కోలుకోలేని దెబ్బ అనే చెప్పొచ్చు. -
ఆంధ్రా సరిహద్దులో ఎన్కౌంటర్.. ఇద్దరి మృతి
రాయ్‌పూర్: ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కాల్పులు కలకలం రేపాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలంతోడు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. పోలీసులకు స్పల్ప గాయాలు అయ్యాయి. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పోలీసులు గత రెండు రోజులుగా భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కదలికలపై పోలీసులతో పాటు భద్రతా సిబ్బంది కూడా అటవీ ప్రాంతాన్ని గాలిస్తోంది. ఈ సమయంలో బాలంతోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు చేయడంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఇద్దరు మృతి చెందగా.. మరికొంతమంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కుంట పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
సుకుమాలో 500మందితో భారీ ఎన్కౌంటర్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు డీజీ అవస్తీ తెలిపారు. ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆయన వివరించారు. అలాగే, మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో 500 మంది జవాన్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో మంగళవారం వేకువజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఎస్పీ ఎలిసెల కల్యాణ్ తెలిపిన వివరాలివీ.. కుంట పట్టణ శివారులో ఉన్న పోటా క్యాబిన్ స్కూల్ సమీపంలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పరస్పరం కాల్పులు జరిగాయి. అనంతరం వేకువజామున 4 గంటల ప్రాంతంలో అటవీప్రాంతంలోకి కొందరు పారిపోయారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టగా ఒక మావోయిస్టు మృతదేహం కనిపించింది. ఒక తుపాకీ, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన నక్సల్‌ను గుర్తించాల్సి ఉంది. -
అమ్మపెంటకు చేరుకున్న మావోయిస్టులు!
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా, కుంట బ్లాక్, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాలచలం అటవీ ప్రాంతంలో ఉన్న అమ్మపెంటకు మావోయిస్టు బలగాలు చేరుకున్నట్లు పోలీసు నిఘావర్గాలు పసిగట్టినట్లు తెలిసింది. ధర్మపేట బేస్ క్యాంప్‌పై దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహం పన్ని అక్కడికి చేరుకున్నారా..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని ధర్మపేట గ్రామంలో రెండు నెలలుగా బేస్ క్యాంప్ నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు 500-600 మంది పోలీస్ బలగాలు అక్కడ ఉన్నాయి. దీంతో వారిపై గుర్రుగా ఉన్న మావోయిస్టులు అడపాదడపా బేస్ క్యాంప్‌పై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీనికి తోడు నిర్మాణ పనులకు వస్తున్న లారీని కూడా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం వద్ద దగ్ధం చేశారు. ఇదిలా ఉండగా పాలచలంపైన ఉన్న ఎర్రబోరు, బెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడా అటవీ ప్రాంతంలో మావోలు విరుచుకుపడి పోలీసులను హతమార్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ మావోయిస్టు బలగాలను 15 రోజుల తర్వాత పాలచలం అటవీప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ధర్మపేట బేస్ క్యాంప్ పై ఏ విధంగా దాడి చేయాలనే దానిపై మావోయిస్టు అగ్రనేత రామన్న అనేక సార్లు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం కిష్టారం, గొల్లపల్లి ప్రాంతాల నుంచి పాలచలం వరకు రోడ్లపై కందకాలు తవ్వి భూబి ట్యాప్స్ అమర్చినట్లు తెలిసింది. దీనికి తోడు చెట్లు నరకి రోడ్డుకు అడ్డంగా పడవేశారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన ప్రకాష్ దళం, ఉదయ్‌సింగ్ దళంలో మిలీషియా సభ్యులతో అమ్మపెంటకు చేరుకోవడం పోలీసులలో కలవరం లేపుతుంది. బలగాలన్నీ అక్కడికి చేరుకుని ఒక్కసారిగా ధర్మపేట బేస్ క్యాంప్‌పై దాడికి దిగుతారా..లేక ఆ ప్రాంతంలో భారీ సమావేశం నిర్వహిస్తారా ....అనే విషయాలు తెలుసుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దుమ్ముగూడెం సరిహద్దుల్లోని వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్సైలతో స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలను రప్పించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దండకారణ్యంలో బేస్ క్యాంప్‌తో పాటు మావోలు మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని డివిజన్లోని పోలీసులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
మందుపాతర పేలుడు: జవాన్లకు గాయాలు
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా సమీపంలోని తడిమెట్ల వద్ద సీఆర్పీఎఫ్ ఐజీ వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చివేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లును హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మందుపాతర పేలుడులో ఐజీ వాహన శ్రేణిలోని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మావోయిస్టుల కోసం పరిసర ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే నిన్న తెల్లవారుజామున మావోయిస్టులు ఇదే ప్రాంతంలో మందుపాతర పేల్చిన ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
ఘటనా స్థలం నుంచి మృతదేహాల స్వాధీనం
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురి జవాన్ల మృతదేహాలను తరలించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 20మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. మృతుల్లో 15మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అయిదుగురు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వారికి భద్రత కల్పించేందుకు జవాన్లు వెళుతున్న మార్గంలో ముందుగా మందుపాతర పేల్చి, అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 150మంది నక్సల్స్ పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో డీఐజీ దీపాంశు కబ్రా తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ముఖ్య ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు. దాడిపై చర్చించిన రమణ్ సింగ్...ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల ఎదుర్కొనేందుకు తమ ముందున్న పెద్ద సవాల్ అన్నారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
మావోయిస్టుల ఘాతుకం : 20 మంది జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గత కొన్ని రోజులుగా ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న మావోయస్టులు.. తాము మందుపాతరలను అమర్చిన చోట్ల కాపుకాశారు. మంగళవారం నాడు దాదాపు ఒక కంపెనీకి పైగా.. అంటే సుమారు 60 మంది జవాన్లతో కూడిన సీఆర్పీఎఫ్ బృందం సొంపల ప్రాంతానికి రాగానే వెంటనే మావోయిస్టులు మందుపాతర పేల్చేశారు. జవాన్లు తేరుకుని, పొజిషన్లు తీసుకుని మావోయిస్టులపై కాల్పులు జరిపేలోపే చుట్టుముట్టి, విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘాతుకానికి సుమారు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల ఘాతకంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


