ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మావోయిస్టుల ఏరివేత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గత కొన్ని రోజులుగా ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న మావోయస్టులు.. తాము మందుపాతరలను అమర్చిన చోట్ల కాపుకాశారు. మంగళవారం నాడు దాదాపు ఒక కంపెనీకి పైగా.. అంటే సుమారు 60 మంది జవాన్లతో కూడిన సీఆర్పీఎఫ్ బృందం సొంపల ప్రాంతానికి రాగానే వెంటనే మావోయిస్టులు మందుపాతర పేల్చేశారు. జవాన్లు తేరుకుని, పొజిషన్లు తీసుకుని మావోయిస్టులపై కాల్పులు జరిపేలోపే చుట్టుముట్టి, విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘాతుకానికి సుమారు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల ఘాతకంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.