పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు, ఇటీవల మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నివాసంలో తేజ్ ప్రతాప్ నివసించిన కాలంలో నమోదైన రూ. 3.6 లక్షల విద్యుత్ బిల్లును ఆయన ఇంకా చెల్లించలేదన్న విషయం తాజాగా బట్టబయలైంది.
పట్నాలోని బ్యూర్ ప్రాంతంలో ఉన్న సొంత ఇంటికి సంబంధించిన విద్యుత్ బిల్లును 2022 జూలై నుంచి ఇప్పటివరకు ఆయన చెల్లించలేదు. మూడేళ్ల బకాయిలు అలాగే పేరుకు పోయాయి. సామాన్యులు ఒక నెల బకాయి ఉన్నా కనెక్షన్ తీసేసే విద్యుత్ అధికారులు తేజ్ ప్రతాప్ విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించడంతో బిహార్ విద్యుత్ సంస్థ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బకాయిలు పెరగకుండా నిరోధించడానికి బిహార్ రాష్ట్ర విద్యుత్ సంస్థ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లకు మారింది. కానీ తేజ్ ప్రతాప్ నివాసంలో మాత్రం పోస్ట్‌పెయిడ్ మీటర్ నడుస్తుండటం గమనార్హం. కంపెనీ నిబంధనల ప్రకారం రూ.25,000, అంతకంటే ఎక్కువ బకాయిలు పడిన పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను వెంటనే రద్దుచే యాలి. బకాయిలు రూ.3 లక్షలు దాటినా అతని ఇంటిఇక విద్యుత్‌సరఫరా ఎందుకు నిలిపేయలేదని పలు పార్టీల నేతలు విమర్శలు మొదలెట్టారు.


