పుట్టింటిపై రోహిణీ ఆచార్య మళ్లీ తీవ్ర ఆరోపణలు
లాలూ ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు మరింతగా రచ్చకెక్కాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య శనివారం పుట్టింటితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి కూడా అయిన తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్‌లే తన నిర్ణయా నికి కారణమని ఆమె ఆరోపించారు.
ఆదివారం ఆమె మరోసారి సామాజిక మాధ్యమ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. పుట్టింట్లో తనను నానాదుర్భాషలాడారని, ఇంట్లోంచి బయటకు నెట్టివేయడంతోపాటు చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న ఒక సోదరి, ఒక వివాహిత, ఒక తల్లికి అవమానం జరిగింది. నానా దుర్భాషలాడారు. మురికిదాన్నంటూ తిట్టారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
ఆత్మ గౌరవం విష యంలో రాజీప డబోను’అని ఆమె తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలేసి బయటకు వచ్చేశా. పుట్టింటి నుంచి నన్ను వాళ్లు దూరం చేశారు. నన్ను అనాథను చేశారు’అంటూ ఆమె ఉద్విగ్నంతో పోస్ట్ చేశారు. ‘నాన్న లాలూకు కిడ్నీ ఇవ్వాలని చెప్పారు. ఇచ్చాను. అయితే, బదులుగా నేను కోట్లాది రూపాయలు డబ్బులతోపాటు, లోక్‌సభ టికెట్ తీసుకున్నట్లు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తన లాంటి కుమార్తె, సోదరి మరెవరికీ ఉండరని, తాను నడిచిన బాటలో మరెవరూ నడవలేరని రోహిణి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నాకు కుటుంబమంటూ లేదు. తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్‌ల గురించి మీరడగొచ్చు. వాళ్లే నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు. వాళ్లు బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడటం లేదు. బిహార్‌లోఅంత ఘోరమైన ఫలితాలు రావడానికి కారణమెవరని దేశ ప్రజలే అడుగుతున్నారు. అందుకు కారణం సంజయ్ యాదవ్, రమీజ్ అంటూ పేర్లు వెల్లడించడంతో వాళ్లు నన్ను అవమానించారు, దూషించారు. పుట్టింటి నుంచి వెళ్లగొట్టారు’అని ఆమె ఆరోపించారు.
ఆమె బాటలో మరో ముగ్గురు
రోహిణీ ఆచార్య సంచలన ప్రకటన, నిర్ణయం నేపథ్యంలో ఆదివారం లాలూ కుటుంబంలో విభేదాలు మరింతగా ముదిరినట్లు సమాచారం. లాలు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా అనే వారు కూడా పట్నాలోని నివాసాన్ని వీడి తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలతో వారు కలత చెందినట్లు చెబుతున్నారు. కాగా, ఈ పరిణామాలపై లాలూ కుటుంబం స్పందించలేదు. ఈ వివాదమంతా తేజస్వీయాదవ్ కేంద్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. దీంతో, లాలూ దంపతులతోపాటు ఆ ఇంట్లో మిసా భారతి మాత్రమే ఉన్నట్లు సమాచారం.
నా గుండె బద్దలైంది: తేజ్ ç్ర³తాప్
రోహిణీ ఆచార్య ఆరోపణల నేపథ్యంలో మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పార్టీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన రోహిణి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తన సొంత పార్టీ జనశక్తి జనతాదళ్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఆయన..‘నా గుండె ముక్కలైంది. నాపై ఎన్ని దాడులు జరిగినా ఓర్చుకున్నా. కానీ, నా సోదరికి జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సోదరి రోహిణికి జరిగిన అన్యాయానికి తగు రీతిలో బదులు తీర్చుకుంటానన్నారు. ‘నాన్నా, మీరు సరేనని ఒక్క మాట అంటే చాలు.. బిహార్ ప్రజలు ఈ కుట్ర దారులను పాతిపెడతారు. ఇది ఒక కుమార్తె మర్యాదకు, బిహార్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం’అని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. లాలూ, రబ్డీ దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుల్లో అతిపెద్ద కుటుంబం లాలూదే.


