పట్నా: ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాని యువకుడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఫార్మల్ షర్ట్, జీన్స్ పాంట్ ధరించిన యువకుడు మంత్రిగా ప్రమాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ యువకుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అతడి పేరు దీపక్ ప్రకాశ్ (Deepak Prakash). రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్ఎం) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కుమారుడు. విదేశాల్లో చదువుకుని వచ్చిన అతడికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల్లో అతడు చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయనను ఆర్‌ఎల్ఎం తరపున ఎమ్మెల్సీని చేస్తారని సమాచారం.
చక్రం తిప్పిన ఉపేంద్ర
ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) సతీమణి స్నేహలత.. ససారాం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నితీశ్ కుమార్ కేబినెట్‌లో ఆర్‌ఎల్ఎంకు దక్కే ఒక్క పదవి ఆమెకే కట్టబెడతారని ప్రచారం కూడా జరిగింది. అయితే తన వారసుడి రాజకీయ అరంగ్రేటం చేయిండానికి ఇదే సరైన సమయమని భావించిన ఉపేంద్ర సేఫ్ గేమ్ ఆడారు. తన కొడుకు దీపక్‌కు నేరుగా కేబినెట్ పదవి దక్కేలా చక్రం తిప్పారు. తన రాజకీయ వారసత్వం కొనసాగేలా దీర్ఘకాల వ్యూహంతో కుమారుడిని అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. సామాజిక సమీకరణాలు కూడా దీపక్‌కు కలిసివచ్చాయి.
చివరి నిమిషంలో తెలిసింది
మంత్రి పదవి గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని దీపక్ తెలిపారు. "నాకు తెలిసినంతవరకు.. మా నాన్న, పార్టీ ముఖ్య నాయకుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందే నాకు తెలిసి.. ఆశ్చర్యానికి లోనయ్యానని మీడియాతో చెప్పారు. యువత, మహిళల కోసం పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ప్రమాణ స్వీకారం తర్వాత అన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అయితే నితీశ్ కుమార్, అమిత్ షా సానుకూలంగా లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అతడికి మంత్రి దక్కిందన్న ఊహాగానాలు వచ్చాయి.
బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన 36 ఏళ్ల దీపక్ ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ససారాం నియోజకవర్గంలో తన తల్లి తరపున ప్రచారం చేసి వెలుగులోకి వచ్చారు. దీపక్ భార్య సాక్షి మిశ్రా (Sakshi Mishra) కూడా అత్తగారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2007లో పాట్నాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన దీపక్ 2011లో మణిపూర్‌లోని MIT నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. 2011 నుంచి 2013 వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విదేశాల్లో పనిచేసిశారు. 2019 నుంచి రాజకీయాల్లో తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వచ్చారు. దీపక్ తాత రామ్ నరేష్ కుష్వాహా ఎమ్మెల్యేగా పనిచేశారు. నానమ్మ మునేశ్వరి దేవి సామాజిక కార్యకర్త.
చదవండి: లాలూ ఫ్యామిలీలో చిచ్చు.. ఎవరీ సంజయ్, రమీజ్?
కేబినెట్‌లో వారసులకు చోటు కల్పించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీపక్ ప్రకాశ్‌తో పాటు హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝీ తనయుడు సంతోష్ కుమార్ సుమన్ (Santosh Kumar Suman) కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


