డ్రగ్ పెడ్లర్‌గా మారిపోయిన సమీప బంధువు
పాలు, గ్రానైట్స్ వ్యాపారంలో విఫలం కావడంతో డ్రగ్స్ దందాలోకి
ఇద్దరితో కలిసి గుట్టుగా వ్యవహారం
ముగ్గురినీ అరెస్టు చేసిన హెచ్–న్యూ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగిగా మారిన బావమరిదిని డ్రగ్ పెడ్లర్‌గా మార్చాడో బావ. ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎండీఎంఏ మాదకద్రవ్యాల దందా ప్రారంభించిన ఇతగాడు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని సబ్– పెడ్లర్స్‌గా మార్చుకున్నాడు. వీరితో కలిసి కొన్నాళ్లుగా వ్యవహారాలు నడుపుతున్నాడు.
దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ముగ్గురికీ చెక్ చెప్పారు. మాసబ్‌ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో వీరిని అరెస్టు చేయడంతోపాటు 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదివారం వెల్లడించారు.
ఆ రెండింటిలో సక్సెస్ కాకపోవడంతో...
ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన ఉప్పుటూరి కార్తీక్ ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తి చేయలేకపోయాడు. సొంతూరిలో పాల కేంద్రం, గ్రానైట్స్ వ్యాపారం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో దురలవాట్లకు బానిసగా మారాడు. రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. నెల్లూరు నుంచి వచ్చి నేరేడ్మెట్లో స్థిరపడిన సీహెచ్ బాలాజీ ఇతడికి బావ అవుతాడు. 2022లో తండ్రి చనిపోవడంతో బాలాజీ డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ నెలకు రూ.22 వేల వరకు సంపాదిస్తున్నాడు.
సిగరెట్‌తో మొదలుపెట్టి ఎండీఎంఏ వినియోగం వరకు వెళ్లిన ఇతగాడు ఆ డ్రగ్‌కు ఉన్న డిమాండ్‌ను కార్తీక్‌కు చెప్పాడు. దీంతో కార్తీక్ కూడా ఈ దందా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తొలినాళ్లలో బెంగళూరు వరకు వెళ్లి నైజీరియన్ల నుంచి ఈ డ్రగ్ ఖరీదు చేసి తెచ్చేవాడు. కొన్నాళ్లుగా నైజీరియన్లు నేరుగా ఇవ్వకుండా తమ ఏజెంట్ల ద్వారా పంపిస్తుండటంతో బెంగళూరుతోపాటు ఆదిలాబాద్‌కూ వెళ్లి తేవడం మొదలెట్టాడు.
దీన్ని ఒక గ్రాము చొప్పున రీప్యాక్ చేసి ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఇతడి నుంచి బాలాజీ కూడా క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేసేవాడు. ఈ దందాలో దిగిన కార్తీక్ తన పేరును అలెక్స్‌గా మార్చుకున్నాడు. ఓ దశలో బాలాజీ ఇతడికి సబ్–పెడ్లర్‌గా మారిపోయాడు. బీటెక్ చదువుతున్న జీడిమెట్లకు చెందిన టి.దీపక్ పార్ట్‌టైమ్‌గా టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు కూడా ఎండీఎంఏ వినియోగం నుంచి విక్రేతగా మారాడు.
డెడ్ డ్రాప్ విధానంలో సరఫరా...
ఈ ముగ్గురూ తమ ఉనికి బయటపడకుండా ఎండీఎంఏను విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్, సోషల్‌మీడియా కస్టమర్లతో రేటు ఖరారు చేసుకుంటారు. ఆపై వారికి క్యూఆర్ కోడ్ పంపి డబ్బు బదిలీ చేయించుకుంటారు. ఆపై ఏదైనా ఓ ప్రాంతంలో డ్రగ్ పెట్టి దాని ఫొటోతోపాటు లొకేషన్‌ను వినియోగదారుడికి షేర్ చేస్తారు. మిగిలిన ఇద్దరూ అలెక్స్ నుంచే సరుకు తీసుకుని పరిచయస్తులైన కస్టమర్లకు అధిక ధరలకు అమ్ముతున్నారు.
వీళ్లు ఒక్కో గ్రాము రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలకు కొని... రూ.ఎనిమిది వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. వీరి దందాపై సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలస్వామి నేతృత్వంలో ఎస్సై బి.మనోజ్‌కుమార్‌తో కూడిన బృందం మాసబ్‌ట్యాంక్‌లో వలపన్నింది. ఎండీఎంఏ సరఫరా చేయడానికి వచ్చిన అలెక్స్‌తోపాటు తీసుకోవడానికి వచ్చిన మిగిలిన ఇద్దరినీ పట్టుకుంది.


