అనగనగా రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్.. అక్కడో అందమైన కోట. అక్కడికి పర్యాటకులు వస్తున్నప్పుడు.. కళ్లెదుట ఓ అద్భుతం జరిగింది. రాజసం ఉట్టిపడే చారిత్రక రణథంబోర్ కోట పార్కింగ్ ఏరియాలోకి ఒక బుల్లి పులి పిల్ల దర్జాగా నడుచుకుంటూ వచి్చంది.
అమ్మ లేనప్పుడు..
ఈ క్యూట్ కిల్లర్ రణథంబోర్ అడవిలో ప్రఖ్యాత పులి ’రిద్ధి’ సంతానం. అమ్మ పక్కన లేని సమయం చూసి, మన బుజ్జిది బయటకు షికారు చేసింది. మెత్తని పాదాలతో, చారల చొక్కా వేసుకుని, అచ్చం పిల్లిలా మెల్లగా కోట పార్కింగ్‌లోకి అడుగుపెట్టింది.
దర్జా చూడు..
సఫారీ జీపుల్లోని పిల్లలు, పెద్దలు ఆశ్చర్యంగా వీడియోలు తీస్తుంటే.. ఈ బుజ్జి పులి మాత్రం ‘నేను మీకంటే అందంగా ఉన్నాను కదా!’అన్నట్టుగా రాజసంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఒక సఫారీ జీపు ఏకంగా ఈ బుజ్జి కూనకు భయపడి వెనక్కి వెళ్లిందంటే నమ్ముతారా?
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..
కోట గోడల మీద నడుస్తూ, పాత కట్టడాల మధ్య దాగుడుమూతలు ఆడుతూ.. ‘ఇది నా ఇలాకా’.. అని నిరూపించింది ఈ చిన్నారి పులి. చరిత్ర అంటే పుస్తకాల్లోనే కాదు, ఇలా పులి పిల్లల నడకల్లో కూడా ఉంటుందని రణథంబోర్ మరోసారి నిరూపించింది. ‘ఇలాంటి క్షణాలే రణథంబోర్‌ను ప్రత్యేకం చేస్తాయి’అని రణతంబోర్ నేషనల్ పార్క్ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పేర్కొంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


