సాక్షి,చెన్నై: తమిళ హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుండి భారీ ఊరట లభించింది. ఆయన నటించిన జన నాయగన్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రివ్యూ కమిటీకి పంపకుండానే హైకోర్టు నేరుగా అనుమతి ఇచ్చింది. కోర్టు స్పష్టంగా జన నాయగన్ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుతో జన నాయగన్ విడుదలకు మార్గం సుగమమైంది. సంక్రాంతి రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతేడాది డిసెంబర్‌లో జన నాయగన్ నిర్మాతలు సినిమా విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డును ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేసింది. ఈ ఆలస్యంపై జననాయగన్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే అంశంపై ఈ బుధవారం విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తాజా విచారణలో సింగిల్ బెంచ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఫిర్యాదు దారుడి గోడు విన్న తర్వాత కూడా సెన్సార్ ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా ఉంది.
అంటే, సీబీఎస్‌ఈ మొదట్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దరఖాస్తును స్వీకరించింది. కానీ తరువాత, విడుదలకు దగ్గరగా వచ్చేసరికి కొత్తగా అభ్యంతరాలు పెట్టింది. ఇది ముందే ఉన్న అసలు సమస్య కాకుండా, తరువాత కల్పించిన సమస్యలా ఉందని కోర్టు భావించింది. అంతేకాదు, సర్టిఫికేషన్ ప్రక్రియలో అనవసరమైన ఆటంకాలు సృష్టించడం తగదని కోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. అనంతరం, సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎస్ బోర్డుకు సూచించింది. దీంతో జన నాయగన్ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.
విజయ్ నటించిన చిత్రాలు తరచుగా రాజకీయ చర్చలకు దారితీస్తాయి. జన నాయగన్ కూడా సమాజంలోని సమస్యలను ప్రతిబింబించేలా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో సీబీఎఫ్‌సీ ఆలస్యం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి.ఈ తీర్పు సినీ పరిశ్రమలో సెన్సార్ బోర్డు పాత్రపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకవైపు సృజనాత్మక స్వేచ్ఛను కాపాడే ప్రయత్నంగా కోర్టు నిర్ణయం కనిపిస్తుండగా, మరోవైపు సర్టిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత అవసరం ఉందని స్పష్టమవుతోంది.



