ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులపై పలు రాష్ట్రాల్లో దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్‌లో త్రిపుర విద్యార్థి ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. జాతి విద్వేషమే ఏంజెల్ చక్మా (24) మృతికి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. పోలీసులు మాత్రం అందుకు తగిన సాక్ష్యాలేవీ లేవంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కులం, జాతి, భాష, ప్రాంతం, సంపద.. ఆధారంగా మనుషులేంటో నిర్ణయించుకోవద్దంటూ అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. ప్రతీ ఒక్కరినీ మనవాళ్లుగానే చూడండి. దేశం ఏ ఒక్కరిదో కాదు. మొత్తం భారత్ మనదే భావనతో బతకండి అని అన్నారాయన. బుధవారం ఛత్తీస్‌గఢ్ సోన్‌పైరి గ్రామంలో నిర్వహించిన హిందు సమ్మేళనంలో మాట్లాడుతూ..
ప్రతివారిని మనవారిగా చూడాలి. దేశమంతా అందరిదేనని భావించాలి. అప్పుడే నిజమైన సామాజిక సామరస్యం వెల్లివిరుస్తుంది. విభజన భావాలు, వివక్ష భావాలను మనసులోంచి తొలగించడమే సామరస్యానికి మొదటి అడుగు అని ఆయన పేర్కొన్నారు.
కనీసం ఇంట్లోనైనా..
భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రజల మధ్య బంధాలను బలపరుస్తుంది. అందుకే వేరే రాష్ట్రాల్లో ఉంటున్నప్పుడు అక్కడి భాషలనూ నేర్చుకోండి.. మాట్లాడండి. ఎందుకంటే.. ఆ రాష్ట్రాలు ఈ దేశంలోనే ఉన్నాయి. అవీ దేశ భాషలే కాబట్టి. ఈ విషయంలో సమతూకం ఉండాల్సిందే. అయితే సొంత స్థలాల్లో ఉన్నప్పుడు.. కనీసం ఇంట్లోనైనా మీ మాతృభాష మాట్లాడండి. అప్పుడే దానికి మనుగడ ఉంటుంది అని అన్నారాయన.
హిందూ ఐక్యతపై..
మన రాజ్యాంగంలో సమానత్వం.. వివక్ష రహిత సమాజం గురించి ప్రస్తావించారు. సమాజంలో హిందువులు తమ ఐక్యతను నిలబెట్టుకోవడానికి నమ్మకం, పరస్పర అవగాహన కీలకం. చెరువులు, శ్మశానాలు వివక్ష లేకుండా అందుబాటులో ఉండాలి. ఆధ్యాత్మిక స్థలాలు(ఆలయాలు) కూడా వివక్షకు తావులేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి. అదే ఐక్యతకు అసలైన సంకేతం. సామాజిక సేవ అనేది ఐక్యత, సామూహిక బాధ్యతతో నడవాలి.. విభేదాలు, సంఘర్షణలతో కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
సాటి హిందువులపై..
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై పెరుగుతున్న నేరాలపై ఆత్మపరిశీలన చేసి నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొనాలని హిందూ సమాజానికి ఆయన పిలుపు ఇచ్చారు. “మనం స్థిరంగా ఉంటే ఎలాంటి సంక్షోభం మనపై ప్రభావం చూపదు. హిందూ సమాజానికి అటువంటి మేధస్సు ఉంది. అందుకే హిందువులు తమలో తాము వివక్ష చూపకూడదు” అని అన్నారు.
సమాజంలో నమ్మకం కోల్పోవడం వల్లే మత మార్పిళ్లు చోటుచేసుకుంటున్నాయన్న ఆయన.. దీన్ని మార్చాలంటే ప్రజలతో గ్రామస్థాయిలో మళ్లీ అనుబంధం పెంచుకోవడం అవసరమని ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులతో అన్నారు కొత్తగా సామాజిక బంధాలు, పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని సూచించారాయన.
పాపం ఏంజెల్ చక్మా..
త్రిపురలోని ఉనకోటి జిల్లాలో మచ్మారా గ్రామానికి చెందిన ఏంజెల్ చక్మా.. డెహ్రాడూన్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నెల 9న కొందరు అతడిపై దాడికి పాల్పడ్డారు. చూడటానికి స్థానికుడిలా లేరనే కారణంతో అతడిపై, అతడి సోదరుడు మైఖేల్ చక్మాపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చక్మా చికిత్స పొందుతూ ఈ నెల 26న ప్రాణాలు కోల్పోయాడు. మైఖేల్ చక్మా ఇంకా చికిత్స పొందుతున్నాడు.

అయితే.. ఇది జాతి విద్వేష హత్యేనని బీఎస్‌ఎఫ్ జవాను అయిన ఏంజెల్ తండ్రి అంటున్నారు. దాడి సమయంలో.. ‘చైనీస్, చైనీస్ మోమో’ అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని మైఖేల్ వాంగ్మూలాన్ని ఆయన మీడియా ఎదుట ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ కోణంలో జరిగిన ఘటన కాదంటూ స్థానిక పోలీసులు ప్రకటించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ఘటనకు కారణమేది అనేది చెబుతామని అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తు జరుగుతుండగా.. ఆ దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని త్రిపుర ప్రభుత్వం కోరుతోంది.


