తీవ్ర సంక్షోభం దిశగా ఇండియా కూటమి రాజకీయం నడుస్తోంది. బిహార్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరేనంటూ ప్రధాన మిత్రపక్షాలు వెలేత్తి చూపిస్తున్నాయి. ప్రధానంగా ఆ పార్టీ వ్యూహాలను, నాయకత్వ లోపాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని ఆ ఒక్క ఫలితం ఇప్పుడు విమర్శల రూపంలో బహిరంగ సంక్షోభంగా మార్చింది. కూటమిలోనే కొనసాగాలా? స్వతంత్ర మార్గం ఎంచుకోవాలా?.. అనే డైలామాలో ఇండియా కూటమి పార్టీలను పడేసింది.
బిహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో అలిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM).. స్వతంత్రంగా కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. కూటమి పెద్దన్న తమను మోసం చేసిందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఓపెన్‌గా కాంగ్రెస్‌పైనే ఆరోపణలు గుప్పించింది. తమను జూనియర్ పార్ట్‌నర్‌లా అవమానకర రీతిలో చూస్తున్న కూటమిలో కొనసాగాలా.. వద్దా? అనేది త్వరలో నిర్ణయిస్తామని ప్రకటించింది కూడా.
మరో ఇండియా కూటమి పార్టీ.. శివసేన (UBT) బీహార్ ఫలితాన్ని ‘‘వేకప్ కాల్’’గా అభివర్ణించింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమిష్టి వ్యూహం దెబ్బతిందని ఆరోపించింది. మిత్రపక్షాలతో జాతీయ పార్టీ సంప్రదింపులు లేకుండా ముందుకు వెళితే కూటమి నిలవదని హెచ్చరిస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో మిత్రపక్ష కూటమి వ్యవహరించిన తీరు నుంచి లోపాల్ని ఎత్తిచూపారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలు జరగకుండా చూసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఈ క్రమంలో ఇండియా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకుని.. ఆ బాధ్యతల్ని అఖిలేష్‌కు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ది మరో పంథా. కూటమిలో మొదటి నుంచి ఆ పార్టీ స్వతంత్ర ధోరణి అవలంభిస్తోంది. రాష్ట్ర స్థాయి విస్తరణను జాతీయ వేదిక కోసం త్యాగం చేయలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతెందుకు బీహార్‌లో స్వతంత్రంగా పోటీ చేసిన ఆప్ నిర్ణయం ఓ ముందస్తు హెచ్చరిక అని.. ఈ స్వతంత్ర ధోరణి ఇతర మిత్రపక్షాలకు కూడా ఆదర్శంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
డీఎంకే ఏమందంటే.. బిహార్‌లో ఎన్డీయే విజయం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓ పాఠం అని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. కూటమి వ్యూహం, నాయకత్వం, సమన్వయంపై పునరాలోచన అవసరమని సూచించారు.
అబ్బే.. అలాంటిదేం లేదు
బిహార్‌లో బలహీన ప్రదర్శనతో కాంగ్రెస్ పైనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కార్నర్ చేస్తూ ప్రత్యర్థులూ సెటైర్లు సంధిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత విధానాల్లో మార్పులు చేయకపోతే కూటమి నిలవబోదంటూ మిత్రపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కూటమి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది.
మిత్రపక్షాలు నిష్క్రమించే యోచనలో ఉన్నాయన్న ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కొట్టిపారేశారు. ‘‘ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఏ ఓటమి కూడా కూటమిని ప్రభావితం చేయలేదు. తమిళనాడు ఎన్నికలకు డీఎంకేతో.. అసోం ఎన్నికల కోసం అక్కడి మిత్రపక్షాలతో వెళ్లబోతున్నాం. రాబోయే రోజుల్లో కూటమిని మరింత బలోపేతం చేస్తాం. ప్రాంతీయ పార్టీలతో చిన్న చిన్న సమస్యలున్నా.. జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయాలను ఎదుర్కోవడానికి మిత్రపక్షాలతో కలిసి పనిచేసి తీరతాం’’ అని ప్రకటించారాయన.
అలా అయితే కష్టమే!
ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఆచితూచి ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు తక్షణ సంప్రదింపులు జరపాలని, సీట్ల పంపకాల విషయంలోనూ జాగ్రత్తగా కాంగ్రెస్‌కు సూచిస్తున్నారు. నాయకత్వ లోపాలను సవరించుకోకపోతే.. మార్పును కోరుకునే గళాలు రాబోయే రోజుల్లో పెరగొచ్చని, అది కూటమి విచ్ఛిన్నానికి దారి తీయక తప్పదని హెచ్చరిస్తున్నారు.


