మున్సిపోల్స్ ముంగిట కాంగ్రెస్‌లో తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందేరం
జిల్లా కాంగ్రెస్ పదవులు ఎవరికి ఇస్తే ఏం తంటా వస్తుందోననే ఆందోళన
మండల పార్టీ అధ్యక్షులను మార్చాల్సిరావడంతో కొత్త సమస్యలు వచ్చే అవకాశం
డీసీసీ కార్యవర్గాల కూర్పు ఈనెల 8కల్లా పూర్తి చేయాల్సిందేనని పీసీసీ ఆదేశం
15వ తేదీలోగా మండల అధ్యక్షుల నియామకం పూర్తి కావాలని స్పష్టీకరణ
ఇన్ని రోజులు ఆగి మున్సిపోల్స్ ముందు ఎందుకంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పార్టీ పదవుల పందేరం అధికార కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికలు ముగిసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కమిటీల కూర్పు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలన్న పీసీసీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లతోపాటు మండల పార్టీ అధ్యక్ష హోదాల్లో ఎవరిని నియమిస్తే ఏం జరుగుతుందోనని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుల నియామకం మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి తంటా తెచ్చిపెడుతుందోననే ఆలోచనతో డీసీసీ అధ్యక్షులకు పేర్లు ఇచ్చేందుకూ వారు వెనుకాడుతుండటం గమనార్హం.
పేరుకే డీసీసీలు..
డీసీసీ అధ్యక్షుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కొత్తగా నియమితులైన తమకు పార్టీ పదవుల నియామకాల్లో ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వడం లేదని వాపోతున్నారు. పార్టీ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లు ఇచ్చి వాటినే చేర్చాలని ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. పీసీసీ మార్గదర్శకాలను కూడా పాటించలేని పరిస్థితుల్లో తామున్నామని చెబుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని వారు డీసీసీ అధ్యక్షులుగా నియామకం కావడంతో అలాంటి జిల్లాల్లో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో తామిచ్చిన పేర్లను డీసీసీ కమిటీల్లో ఉంచాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారని, వారి సూచనల మేరకు కార్యవర్గం ఏర్పాటు చేసి భవిష్యత్తులో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలని డీసీసీలు ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా తమ మాటకు విలువ ఇస్తామని పీసీసీ, ఏఐసీసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని అంటున్నారు. కనీసం పార్టీ కార్యవర్గంలో పదవులు ఇచ్చే అధికారం కూడా తమకు లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకుండా జాప్యం చేసిన పీసీసీ.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని డీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం వేరేలా ఉందని, మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక జిల్లా కమిటీలను ప్రకటించాలని కోరుతున్నారని, ఈ అంశాన్ని పీసీసీ పరిగణనలోకి తీసుకోవాలని, జిల్లా కార్యవర్గం కూర్పులో డీసీసీలకూ కోటా పెట్టాలని వారు కోరుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ విషయమై జిల్లా మంత్రికి ఇష్టం లేకుండా నియమితుడైన దక్షిణ తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో కూడా మా ఫొటోలు పెట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లతో జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి మేము ఏం చేయాలి? రేపు మా మాట ఎవరు వింటారు? పార్టీని నడిపేదెట్టా? ఆరునెలల పనితీరును చూసి అవసరమైతే డీసీసీ అధ్యక్ష పదవులు తీసేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మరి ఈ సిఫారసులు, ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలో.. మున్ముందు ఎలా పనిఏయాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
కార్యవర్గం కూర్పు ఇలా..!
జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పునకు పీసీసీ మార్గదర్శకాలను రూపొందించింది. పీసీసీ సూచించిన ప్రకారం ప్రతి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా డీసీసీ కార్యవర్గం సంఖ్య ఖరారు కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బ్లాకులు ఏర్పాటు చేసి, ప్రతి బ్లాక్ నుంచి ఒక డీసీసీ ఉపాధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించనున్నారు. అదేవిధంగా ప్రతి డీసీసీకి ఒక కోశాధికారిని నియమిస్తారు. దీంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీసీసీ అధికార ప్రతినిధి, ప్రతి మండలం నుంచి డీసీసీ కార్యదర్శిని ఎంపిక చేస్తారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీలు, ఇతర సీనియర్ నేతల సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటారు. డీసీసీ కార్యవర్గాల కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీనియర్లకు ఆఫీస్ బేరర్లలో అవకాశం కలి్పంచాలని పీసీసీ నిర్ణయించింది. బీఆర్‌ఎస్ లేదా ఇతర పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికీ స్థానిక పరిస్థితుల ఆధారంగా 20–30 శాతం పదవులు ఇవ్వాలని చెప్పింది.
డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్
జిల్లా కార్యవర్గంతోపాటు మండల పార్టీ అధ్యక్ష నియామకాలు, ఏఐసీసీ పిలుపుల అమలు ఎజెండాగా ఆదివారం జూమ్ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డీసీసీ కార్యవర్గాలను పూర్తి చేసి ఈనెల 8కల్లా పూర్తిస్థాయి నివేదికలను పీసీసీకి పంపాలని, 15వ తేదీలోపు మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 8న గాం«దీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి సీఎం రేవంత్‌తోపాటు మీనాక్షి కూడా హాజరవుతారని మహేశ్ గౌడ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలన్న ఏఐసీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేశ్‌గౌడ్ ఆదేశించారు.


