గత ప్రభుత్వంలో మొదలైన ఇళ్లకు నిధుల విడుదలకు యోచన
ఇందిరమ్మ జాబితాలో చోటు దక్కకున్నా పనులు ప్రారంభించుకున్న వారికీ శుభవార్త.. వేల మందికి కలగనున్న లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ‘గృహలక్ష్మి’పథకం ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఆ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ లబ్ధిదారుల అర్హత వివరాలను పరిశీలించి, ఇందిరమ్మ పథకం కింద నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి తుది నిర్ణయం వెలువడనుంది. ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించిన వెంటనే కొందరు పేదలు అత్యుత్సాహంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కానీ, తుది జాబితాలో చోటు దక్కక వారికి నిధులు అందలేదు. దీంతో ఆ ఇళ్లు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రెండు రకాల అసంపూర్తి ఇళ్లు కలిపి దాదాపు 13 వేల వరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తం ఇళ్లను ఇందిరమ్మ పథకంలోకి తీసుకురానున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఆపై గృహలక్ష్మి
గత ప్రభుత్వం రెండు బెడ్ రూమ్‌ల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. దానికి నిధుల సమస్య రావటంతో ఆ ఇళ్లను పూర్తి చేయలేక మధ్యలో వదిలేసింది. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్ రూ.5 లక్షలు కాగా, గృహలక్ష్మి పథకంలో అది రూ.3 లక్షలు మాత్రమే. రూ.3 లక్షలను కిస్తీల వారీగా లబ్ధిదారులకే చెల్లిస్తూ వారే ఇళ్లను నిర్మించుకునేలా దాన్ని ప్రకటించింది. దాదాపు పది వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిధులు కూడా విడుదల కాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో, ఆ పథకం అధికారికంగా రద్దయింది. దీంతో ప్రారంభించుకున్న ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ఆ లబ్ధిదారులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. వచ్చే ఏప్రిల్‌లో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు ఉండనున్నందున, ఈ గృహలక్ష్మి ఇళ్లను కూడా ఇందిరమ్మ పరిధిలోకి తీసుకొచ్చి వాటికి నిధులు విడుదల చేసే విషయమై తదుపరి కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇందిరమ్మ కాని ఇందిరమ్మ ఇళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించిన వెంటనే కొందరు పేదలు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. తదుపరి జాబితాలో తమకు చోటు దక్కుతుందో లేదో అన్న ఉద్దేశంతో, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే చోటు ఖాయమవుతుందనుకున్నారు. కానీ, వారికి చోటు దక్కలేదు. జాబితాలో వారి పేరు లేనందున ఇందిరమ్మ నిధులు వారికి అందటం లేదు. అలా ముందే ప్రారంభించుకున్న ఇళ్ల సంఖ్య మూడు వేల వరకు ఉందని ఇటీవల అధికారులు గుర్తించారు. మలి విడతలో వీరికి కూడా నిధులు చెల్లిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


