సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలి? రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాందీని అశోక్ నగర్ అడ్డా మీద, రైతు రుణమాఫీ అమలు చేయనందుకు వరంగల్‌లో ఉరి తీయాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కామారెడ్డి చౌరస్తాలో రేవంత్‌ను, కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలి. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచి్చంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
‘రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదు. కానీ మాకు మూడు నాలుగు భాషల్లో సమాధానం చెప్పగల శక్తి ఉంది. ఐఐటీకీ, ట్రిపుల్ ఐటీకీ, బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియని అజ్ఞాని తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదం. కృష్ణా, గోదావరి బేసిన్ల గురించి బేసిక్స్ గురించి తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని పాలన ఇది’ అని కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ స్థాయిని తగ్గించలేడు..
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులపై తుపాకీ ఎత్తిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేడు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు ఎండగడతాం. శాసనసభలో జరుగుతున్న చర్చల తీరును, ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత పెద్దలు చెప్పిన మాట ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అనే సామెత గుర్తుకొస్తోందన్నారు. పదేపదే చావు, ఉరిశిక్షలు అంటూ మాట్లాడే వ్యక్తి.. రైతుబంధు వంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్‌పై అనరాని మాటలు అనడం దుర్మార్గం’’ అని కేటీఆర్ అన్నారు.


