బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి నుంచి తేరుకోక ముందే ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో సతమతమవుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే నోటీసులు ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.
తిరిగి అధికారంలోకి వచ్చిన నితీశ్ ప్రభుత్వం.. లాలూ కుటుంబానికి ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని నోటీసులు జారీ చేసింది. గత 20 ఏళ్లుగా లాలూ కుటుంబం ఈ బిల్డింగ్‌లోనే ఉంటోంది. ఆర్జేడీ కార్యకలాపాలు, కీలక సమావేశాలు, ప్రెస్‌మీట్‌లు వగైరా.. ఈ బంగ్లా నుంచే నిర్వహించేవారు.
ఈ పరిణామంపై లాలూ తనయ రోహిణి ఆచార్య స్పందించారు. సుశాసన్ బాబు(నితీశ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ..) ప్రభుత్వం లాలూ కుటుంబాన్ని అవమానించడంపైనే దృష్టిసారించినట్లు కనిపిస్తోందని ఓ ట్వీట్ చేశారు. బంగ్లా నుంచి బయటకు పంపినా.. బిహారీల గుండెల్లోంచి లాలూను బయటకు పంపించలేరని అన్నారామె. ఈ క్రమంలో.. ఆయన హోదా, వయసుకైన ప్రభుత్వం గౌరవం ఇస్తే బాగుండేదేమో అని అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. ఇది రబ్రీదేవికే పరిమితం కాలేదు. లాలూ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కూడా ఎం స్ట్రాండ్ రోడ్ బంగ్లా 26లోని బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ప్రస్తుతం ఈ నివాసంలోనే ఉంటున్నాడు. తాజాగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌లోని మంత్రి లకేంద్ర కుమార్ రోషన్‌కు ఆ బంగ్లా కేటాయించినట్లు సమాచారం.
రాజకీయ పరాజయం, కుటుంబ అంతర్గత విభేదాలు, ఇప్పుడు నివాస సమస్య.. వెరసి మూడు కలసి యాదవ్ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. ఆర్జేడీ నేతలు దీనిని నోటీసుల వ్యవహారాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ మాత్రం ఆ విమర్శను తోసిపుచ్చుతోంది. లాలూ కుటుంబం బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని.. తమ ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుందని అంటోంది.
అధికార వర్గాలు మాత్రం "నిబంధనల ప్రకారం" ఈ చర్య తీసుకున్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ అధికారి శివ్‌రంజన్ స్పందిస్తూ.. రబ్రీదేవి ప్రస్తుతం ఉన్న హోదా ప్రకారం వేరే కేటగిరీ బంగ్లా కేటాయించినట్లు స్పష్టత ఇచ్చారు. కొత్తగా హార్డింగ్ రోడ్‌లోని 39 నంబర్ సెంట్రల్ పూల్ బంగ్లాను ఆమెకు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె బిహార్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ నేతృత్వంలో బిహార్ ప్రభుత్వం తాజాగా కొలువుదీరింది. ఇందులో.. 13 మంది మంత్రులకు అధికారిక బంగ్లాలను కేటాయిస్తున్నారు.
లాలూ పెద్ద కొడుకు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలను(ప్రియురాలితో ఉన్న ఫొటోను) నెట్టింట పెట్టి పార్టీ పరువు తీశారని ఆర్జేడీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. సొంతంగా పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడారాయన. ఈ క్రమంలో ఇప్పుడు అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేయాల్సి రావడం గమనార్హం.
మరోవైపు.. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అవమానాలు, సోదరుడు తేజస్వి యాదవ్‌తో విబేధాల నేపథ్యంతో రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్‌బై చెప్పారు. అంతేకాదు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా కుటుంబానికి కూడా దూరంగా ఉంటానని ప్రకటించారామె.


