పట్నా: హిజాబ్, మాస్క్, ముఖాన్ని దాచే మరేదైనా తరహా వస్త్రంతో బంగారం దుకాణంలోకి వచ్చి ఆభరణాలను కొనుగోలుచేస్తామంటే వాళ్లకు బంగారునగలు విక్రయించబోమని బిహార్ నగరవ్యాపారులు తెగేసి చెప్పారు. హిజాబ్, మాస్క్ వంటివి ధరించి వచ్చిన మహిళలు, వ్యక్తులు దొంగతనాలకు పాల్పడిన సందర్భాల్లో సీసీటీవీల్లో చూసి తర్వాత వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలభారత ఆభరణాలు, స్వర్ణకారుల సమాఖ్య(ఏఐజేజీఎఫ్) బిహార్ శా ప్రకటించింది. ఈ మేరకు ఏఐజేజీఎఫ్ బిహార్ విభాగ అధ్యక్షుడు అశోక్ వర్మ బుధవారం పట్నాలో మీడియాతో మాట్లాడారు.
‘‘ ముఖం కన్పించకుండా హిజాబ్, మాస్క్ వంటివి ధరించి నగల దుకాణంలోకి వచ్చిన వారికి మేం నగలను ప్రదర్శించబోం. ముఖం చూపిస్తేనే మేం నగలను చూపిస్తాం. మా నగల, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికొచ్చాం’’ అని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ముఖం కన్పించకుండా, వినియోగదారుల్లా దుకాణాల్లోకి అడుగుపెట్టిన పలువురు దొంగలు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చాకచక్యంగా కొట్టేయడం తెల్సిందే. తర్వాత సీసీటీవీల్లో పోలీసులు, నగల వ్యాపారులు పరిశీలించినా దొంగలను గుర్తుపట్టలేని పరిస్థితి దాపురించింది.


