పాట్నా: బిహార్‌లో ఆర్జేడీ ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య.. తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్బంగా ‘నేను రాజకీయాలను వదిలేస్తున్నా. నా కుటుంబానికి దూరంగా జరుగుతున్నా. ఈ పని చేయాలని నాకు సంజయ్ యాదవ్, రమీజ్ సూచించారు. నిందలన్నీ నేనే భరిస్తా’ అని శనివారం ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.
రమీజ్ ఎవరు?
ఈ నేపథ్యంలో సంజయ్ యాదవ్, రమీజ్‌పై కొత్త చర్చ మొదలైంది. కాగా, రమీజ్ ఆలం ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన వ్యక్తి. జార్ఖండ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని గురించి రాజకీయ వర్గాలలో చాలా తక్కువగా తెలుసు. తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్‌కు రమీజ్ సన్నిహితుడు. అయితే, రమీజ్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ అనే మార్క్ అతడిపై ఉంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. అతని మామ ఉత్తరప్రదేశ్‌లోని అగ్ర నేరస్థుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. రమీజ్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది. అయితే వారిద్దరూ రోహిణికి ఏం సూచించారనేది స్పష్టంగా తెలియడం లేదు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
తేజ్ ప్రతాప్ ఎఫెక్ట్..
వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. తన భర్త, పిల్లలతో సింగపూర్‌లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.
ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్‌తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతి జోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.


