పుణే జర్మన్‌ బేకరీ కేసు నిందితుడి హతం | Pune German Bakery blast terror accused Bunty Jahagirdar News | Sakshi
Sakshi News home page

పుణే జర్మన్‌ బేకరీ కేసు నిందితుడి హతం

Jan 1 2026 12:56 PM | Updated on Jan 1 2026 1:41 PM

Pune German Bakery blast terror accused Bunty Jahagirdar News

పుణే జర్మన్‌ బేకరీ పేలుడు కేసులో నిందితుడు(సహ) అస్లాం షబ్బీర్‌ షేక్‌(బంటి జాహగీర్దార్) హత్యకు గురయ్యాడు. బుధవారం మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో బైక్‌పై వచ్చిన వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్‌ శాఖ ధృవీకరించింది.

జర్మన్‌ బేకరీ పేలుడు కేసులో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాది హిమాయత్ బైగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అస్లాం షబ్బీర్‌ షేక్‌ (బంటి జాహగీర్దార్‌) సహనిందితుడు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఈ పేలుడుకు సహకరించాడనే అభియోగాలు అతనిపై ఉన్నాయి. ఈ కేసులో బంటి జహగీర్దార్‌ 2010లో అరెస్టయ్యాడు కూడా. అయితే.. 2013లో బాంబే హైకోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేయగా.. అప్పటి నుంచి బయటే ఉంటున్నాడు.  

బుధవారం శ్రీరాంపురంలో ఓ అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

జర్మన్‌ బేకరీ పేలుడు కేసు (2010) భారతదేశంలో జరిగిన ఒక ప్రధాన ఉగ్రదాడి. 2008 26/11 ముంబై దాడుల తర్వాత అంతటి దాడిగా పేరుగాంచింది. ఫిబ్రవరి 13వ తేదీన పుణే  కోరేగావ్‌ పార్క్‌  సమీపంలోని జర్మన్‌ బేకరీ వద్ద పేలుడు జరిగింది. ఈ ఘటనలో 18 మంది(విదేశీయులు సహా) ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. 

తొలుత ఇది సిలిండర్‌ బ్లాస్ట్‌గా భావించారు. అయితే.. ఫోరెన్సిక్‌ నివేదికలో ఆర్డీఎక్స్‌ వాడినట్లు తేలింది. దీంతో ఉగ్రదాడి అయి ఉంటుందని పుణే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోపు దాడికి తామే బాధ్యులమని లష్కరే తాయిబా, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థలు ప్రకటించుకున్నాయి. కరాచీ ప్రాజెక్టులో భాగంగా.. డేవిడ్‌ హెడ్లీ నేతృత్వంలో ఈ దాడికి రూపకల్పన జరిగిందని భారత దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement