మీరు గుడి గంటలు విని ఉంటారు..
లేదంటే బడి గంటలు!
మరి.. చదువు గంటలు!
ఇవి వినాలంటే మాత్రం..
కర్ణాటకలోని బెళగావి జిల్లా హలగా గ్రామానికి వెళ్లాల్సిందే!.
ఈ కాలపు పిల్లలు అందరిలో సామాన్యమైన విషయం ఒకటుంది. మీరెప్పుడైనా గుర్తించారా? అదేనండి.. పొద్దస్తమానం మొబైల్‌ఫోన్ పట్టుకుని ఉండటం. ‘‘ఈ పిల్లలు ఎంత చెప్పినా వినరు’’.. ‘‘చదువుకోమంటే.. రీల్స్ చూస్తూ గడిపేస్తారు’’ అని తిట్టని తల్లిదండ్రులుండరు. ఇంటికొస్తే కనీసం మాట్లాడకుండా ఆ ఫోన్ చూస్తూండటం ఏమిటని సణుక్కోని బంధువూ ఉండడు. అయినా సరే.. ఈ మొబైల్ ఫోన్ జాడ్యం పిల్లల్ని వదిలిపోనంటుంది. అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హలగా గ్రామ ప్రజలు కలిసికట్టుగా తీసుకున్న ఒక నిర్ణయం అక్కడి పిల్లల భవిష్యత్తును మార్చేస్తేంది. మంచికే లెండి!.
హలగా గ్రామ జనాభా సుమారుగా 8500 మాత్రమే. చాలా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. అయితే బయటి ప్రపంచం ప్రభావమో.. ఇంకోటో తెలియదు కానీ.. వీళ్లు కూడా మొబైల్ ఫోన్ లేదంటే టీవీలకు అతుక్కుపోయేవారు. చదువుతోపాటు వారి ఏకాగ్రత కూడా దెబ్బతింటూ వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ పెద్దలు ఇక లాభం లేదనుకున్నారు. చెక్ పెట్టాల్సిందేనని తీర్మానం చేసుకున్నారు. పంచాయితీ పెట్టి.. గ్రామస్తులందరితోనూ చర్చించి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
What a meaningful behavioural change! Halaga village in Belagavi practises a two-hour digital detox every evening. This can significantly enhance connections with family and friends and improve sleep quality. Such positive behavioural shifts should be encouraged during… pic.twitter.com/PrdY5HLlrc
— Shreyas S P (@sp_shreyas_) December 24, 2025
రోజూ రెండు గంటలు...
గ్రామస్తుల నిర్ణయం గత నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం కచ్చితంగా ఏడు గంటలకు గ్రామంలో ఒక సైరన్ మోగింది. అంతే.. ముందుగా అనుకున్నట్లు పిల్లలు అందరూ అలర్ట్ అయిపోయారు. మొబైల్‌ఫోన్లు, టీవీలు వదిలేశారు. ఆటపాటలూ కట్టిపెట్టి బుద్ధిగా పుస్తకాలు పట్టుకున్నారు. ‘‘రెండు గంటలపాటు కచ్చితంగా చదువుకోవాలి’’ అన్న గ్రామస్తుల నిర్ణయం.. సైరన్ మోతల ప్రభావం అన్నమాట. మోడర్న్ భాషలో చెప్పాలంటే.. ఆ గ్రామస్తులు పిల్లలకు ‘డిజిటల్ డీటాక్స్’ను పరిచయం చేశారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఏడు గంటలకు సైరన్ మోగడం.. పిల్లలు చదువు బాట పట్టడం సాగిపోతోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లు కూడా టీవీలు బంద్ పెట్టాలి. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో మొదలైన ‘డిజిటల్ ఆఫ్’ ప్రయోగమే హలగాలోనూ మొదలైనట్లు వార్తా పత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది.
మళ్లీ మునుపటి రోజులు...
టీవీ, ఫోన్లు లేని సమయాల్లో పొద్దుపోయాక గ్రామాల్లో మాటల వెలుగులు విరబూసేవి. పల్లె నడిబొడ్డున ఉండే రచ్చబండ వద్దో లేక ఇళ్ల చావిళ్లలోనో బోలెడన్ని ముచ్చట్లు గలగల పారేవి. ‘చదువు సైరన్’ మొదలైన తరువాత హలగాలోనూ ఇదే సందడి కనిపిస్తోందంటున్నారు. పిల్లల చదువులకు అంతరాయం కలక్కుండా తల్లిదండ్రులు కూడా ఫోన్, టీవీలను కట్టేస్తూండటంతో మాట్లాడుకోవడం ఎక్కువైంది. ఇది బాంధవ్యాలను మరింత పెంచేదే. పైగా స్క్రీన్‌టైమ్ తగ్గిపోవడంతో.. అది కూడా నిద్రకు కొంచెం ముందు కావడంతో పిల్లలు గాఢంగా నిద్రపోగలుగుతునారు. ఇది కాస్తా వారు బడుల్లో ఏకాగ్రతతో ఉండేందుకు, చురుకుగా ఆలోచించేందుకూ ఉపయోగపడుతోంది. ఈ ట్రెండ్ ఒక్క హలగాలోనే కాదు.. ప్రతి ఊళ్లోనూ కనిపించాలని కోరుకుందాం.
సాక్షి.కాం తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ న్యూస్ ఎడిటర్.


