ఈనాడు మీడియాను తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచే నడుపుతున్నారట. నిజం కాదని ఎంతగానో అనుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో ఆ పత్రికలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ ప్రచారాన్ని నమ్మక తప్పడం లేదు. ఏదో.. ఎవరి ప్రయోజనం ఏమిటో తెలియదని కొందరు సరిపెట్టుకుంటున్నారు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌లను ఈ మీడియా సంస్థ కాపుకాస్తున్న విధానం రోజురోజుకూ మితిమీరిపోతోంది. పైగా ఇందుకోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై చండాలపు సంపాదకీయం ఒకటి రాసిపెట్టడం ఏహ్యభావాన్ని మరింత పెంచుతోంది.
అది సంపాదకీయం చదివిన తర్వాత కచ్చితంగా ఇది టీడీపీ ఆఫీస్ నుంచి రాసి ఉండవచ్చని అనిపించింది. చాలామంది ఇదే విషయం చర్చించుకుంటున్నారు కూడా. టీడీపీ ఆఫీసులోని ఒక టీమ్ ఈనాడులో ఏ రోజు ఏ వార్త రావాలో నిర్దేశిస్తున్నారని, టీడీపీ రచయిత ఎవరో రాసిన వ్యాసాన్ని ఈనాడు యథాతథంగా సంపాదకీయంగా ప్రచురించి ఉండవచ్చని అనిపిస్తోంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ఈనాడుకు ఆదేశాలు వెళుతున్నాయా? ఏమో తెలియదు కానీ.. చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత విధేయులుగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి ఆ పత్రిక ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తోందేమో.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ విధానం సుస్పష్టం. వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ సందర్భంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మొత్తం ఒక స్కామ్ అని, అందులో భాగస్వాములైన వారందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తప్పట. అలా మాట్లాడకూడదట. పీపీపీ విధానాన్ని వ్యతిరేకించకూడదట. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందట. అంతటితో ఆగలేదీ పచ్చపత్రిక. జగన్ క్రూరుడని, ఆయనవి విష రాజకీయాలని 11 సీట్లకే పరిమితమైన తరువాత బెదిరింపు భాష మానుకోలేదని నానా మాటలు తన సంపాదకీయం ద్వారా అనేసింది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చునని బాబు అండ్ కోకు వత్తాసుపలికింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని ఎడిటోరియల్‌గా అచ్చేసింది ఈనాడు పత్రిక. బాబు వాక్యం వేదమైనట్లు, ఎవరూ వ్యతిరేకించకూడదన్న బానిస మనస్తత్వం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటుంది. వైఎస్సార్‌సీపీ వాదన అక్షరం రాయకుండా ఆసాంతం జగన్‌పై విషం చిమ్మారంటేనే ఇదంతా టీడీపీ రాతే అయి ఉంటుంది. జగన్ విధానంతో ఏకీభవించవచ్చు.. లేక వ్యతిరేకించవచ్చు. కానీ, రెండు వైపుల వాదనలు వివరించి జగన్ వాదన ఏ రకంగా తప్పో రుజువు చేసి ఉంటే హుందాగా ఉండేది. ఏకపక్షంగా పచ్చి అబద్దాలను ప్రచురించడం ఏ రకమైన జర్నలిజం?. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్‌కు అసలు బలమే లేదని కదా వీరి అభిప్రాయం. అలాంటప్పుడు ఆయనను పట్టించుకుని ఇంత నిర్లజ్జగా ఎడిటోరియల్ రాయవలసిన అవసరం ఏమిటి?.
జగన్ హెచ్చరికలకే ప్రైవేటు సంస్థలు రాకుండా పోయాయన్నది నిజమే అనుకుంటే జనాభిప్రాయానికి వారు భయపడుతున్నట్లు అంగీకరించినట్లేనా? అంతేకాదు.. ఈ లెక్కన ఈనాడు మీడియా కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అని నిర్ధారిస్తున్నట్లే కదా!. చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసలు మెడికల్ కాలేజీలు జగన్ ఎక్కడ నిర్మించారని ప్రశ్నించి నాలుక కరుచుకున్నారు. జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు ఆ కాలేజీల వద్దకు వెళ్లి వాటిని ప్రజలందరికీ చూపించారు. అయినా కూడా మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మించలేదని గుడ్డిగా ప్రశ్నించింది ఈనాడు!. నిధుల కొరతవల్ల ప్రభుత్వం పీపీపీ విధానంలోకి వెళ్లి ఉండవచ్చనని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ పచ్చ పత్రిక అమరావతి పేరుతో వేలకు వేల కోట్లు అప్పులు తేవడాన్ని ఏనాడైనా ప్రశ్నించిందా?.
జగన్ అధికారంలో ఉండగా.. ప్రతి విషయాన్ని వక్రీకరించిన ఇదే పత్రిక ప్రజలను మోసం చేయడానికి టీడీపీ, జనసేనలతో కుమ్మక్కై అప్పులపైన, అమ్మాయిల మిస్సింగ్‌లపై, భూముల రీసర్వే వంటి అంశాలపై ఎంత తప్పుడు ప్రచారం చేసిందీ ప్రజలకు తెలియకుండా ఉంటుందా? బాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లది క్రూరత్వం, కపటత్వం కావా?. తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి వాటిని విస్మరించడం, ఎగ్గొట్టడం ఏనాడూ ఈ పచ్చ పత్రికలకు కనపడలేదు. ఎన్నికలకు ముందు సెల్ఫ్ పైనాన్స్ సీట్లకు జగన్ అనుమతిస్తే వ్యతిరేకించిన బాబు, లోకేశ్‌లు ఆ తరువాత ప్లేటు ఫిరాయించినా, వైద్య కళాశాలల ఆస్తులు అప్పనంగా ప్రైవేటువారి పరం చేస్తున్నా పట్టలేదు.
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగంలో కాలేజీలు మంజూరు చేసింది. పీపీపీ విధానంలోనే చేయాలని ఆదేశించలేదే? అయినా పార్లమెంటరీ కమిటీ సిఫారసు అని మరొకటని ఎందుకు ఈనాడు మీడియా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది? అందులో వారి స్వార్ధం ఏమిటి? జగన్ టైమ్‌లో అనేక అంశాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూటమి పాలనలో ఎందుకు వెనుకబడిపోయిందన్న విషయం రాసి ఉంటే ఈనాడును అభినందించి ఉండవచ్చు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు అనేక తప్పుడు కథనాలు వండి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కృషి చేసిన ఈనాడు ఇప్పుడు అదే పని చేస్తోంది. ఏడాదిన్నరగా రెడ్‌బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలపై నోరు మెదిపితే ఒట్టు ఈ పత్రిక. కదిరి వద్ద ఎవరో ఒక వ్యక్తి తన వదినతో గొడవపడి తోస్తే, దానికి.. జగన్ పుట్టిన రోజును జతచేసి అతను వైఎస్సార్‌సీపీ వాడని ఆరోపించి, పోలీసులు కొట్టి రోడ్డుపై తీసుకువెళితే ఈనాడు, ఎల్లోమీడియా మొదటి పేజీలో వార్తలు ఇచ్చాయి.

చిన్నపాటి కుటుంబ గొడవను మొదటి పేజీలో వేశారంటే అది టీడీపీ టీమ్ ఆదేశాల మేరకే జరిగి ఉండవచ్చన్న భావన కలుగుతుంది. తీరా అతను జనసేనకు చెందిన వ్యక్తి అని తేలితే ఎల్లో మీడియా కిక్కురుమనలేక పోయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కత్తులు తిప్పుతూ రోడ్డుమీద వీరంగం వేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు? ఎవరు తప్పు చేసినా తప్పే అని రాయవలసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా చేయకపోగా, వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ముతూ జనానికి కంపరం పుట్టిస్తున్నాయి. అమరావతిలో ఒక రైతు మంత్రి నారాయణ సమక్షంలో తన ప్లాట్ గురించి ఆవేదన వ్యక్తం చేసిన కొద్దిసేపులోనే గుండెపోటుకు గురై ప్రాణం కోల్పోతే ఆ వాస్తవాన్ని రాయకుండా కప్పిపుచ్చినప్పుడే ఈనాడు, తదితర ఎల్లో మీడియా నైతికంగా పాతాళానికి చేరినట్లు అయ్యింది.
ఈ సందర్భంలో ఏపీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని ఈ మీడియా చెబుతోంది. ఇది వాస్తవమే అనిపిస్తుంది. కాకపోతే అది జగన్ వల్ల కాదు. మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ అరాచకాలు, ఎన్నికల ప్రణాళిక అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తుండడం వల్ల అని గమనించాలి. ఈ పరిణామాలన్నిటిపై రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. అది తిరుగుబాటుగా మారకుండా ఉండడానికి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈనాడు గ్రూప్‌కు చెందిన మార్గదర్శికి సంబంధించి కేసులు ఎత్తివేయడం, జప్తు అయిన రూ.వెయ్యి కోట్లు విడుదల చేయడం తదితర ఆర్థిక ప్రయోజనాలు పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి లొంగి పనిచేయకుండా ఎలా ఉంటుంది?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


