బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఎమ్మెల్యే తేజస్వి యాదవ్‌ను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. నిన్న( సోమవారం) జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ఈ మేరకు ఏకగీవ్రంగా తేజస్విని ఎంపిక చేశారు.
అయితే తేజస్వి యాదవ్‌ను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే క్రమంలో హైడ్రామానే నడిచిందట. ఆ పదవిని తీసుకోవడానికి తేజస్వి తొలుత ఒప్పుకోలేదట. తనకు ఆ పదవి వద్దని, తాను ఎమ్మెల్యేగా సేవ చేస్తానంటూ అలకబూనారట. అయితే దీనిపై తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ బుజ్జగింపులకు దిగడంతో ఎట్టకేలకు తేజస్వి ఒప్పుకున్నారట.
శాసనసభ ప్రతిపక్ష నేతగా కచ్చితంగా తేజస్వినే ఉండాలని నచ్చచెప్పారట లాలూ. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రతిపక్ష నేత పదవిని వద్దనడం సబబు కాదని లాలూ.. తేజస్విని ఒప్పించారట. దాంతో ఎట్టకేలకు తేజస్వి యాదవ్ దిగివచ్చి సరేనన్నారట. దాంతో సోమవారం జరిగిన ఆర్జేడీ పార్టీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది.
ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు లాలూ ప్రసాద్ యాదవ్ సందేశాన్ని కూడా ఇచ్చారు. తమ కుటుంబ సమస్యలపై పార్టీ కార్యకర్తలు దృష్టి సారించకుండా, పార్టీ ఎదుగుదల, మెరుగుదల కోసం పాటు పడాలని సూచించారు. తమ కుటుంబంలో సమస్యను తాను చూసుకుంటనని, కార్యక్తరలు ఎవరూ దీనిపై చింతించాల్సిన అవసరం లేదని ధైర్యం నింపే యత్నం చేశారు.
ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 25 సీట్లను మాత్రమే గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లను గెలుచుకున్న ఈ పార్టీ.. ఇప్పటి ఎన్నికల్లో మాత్రం ఘోరంగా చతికిలబడింది. కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు పార్టీలు మహాకఠ్ బంధన్‌గా ఏర్పడి పోటీకి దిగినా ఎన్డీఏకు అడ్డుకోలేకపోయాయి. ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో గెలిచి బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి:
నేనున్నా.. చూసుకుంటా: లాలూ ప్రసాద్ యాదవ్


