అత్యద్భుతమని కొనియాడిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్: గుజరాత్ అంతర్జాతీయ ఫ్లవర్ షో మరోసారి తన సత్తా చాటింది. సబర్మతి నదీతీరంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న 14వ ఫ్లవర్ షో వరుసగా మూడోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దక్కించుకుంది. ఈ ఏడాది ఏకంగా రెండు ప్రపంచ రికార్డులను సాధించింది. 10 లక్షల పుష్పాలతో తయారు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద బొకేతోపాటు, అత్యధిక సందర్శకుల రికార్డును కూడా నెలకొల్పింది.
ఈ ప్రదర్శన అత్యద్భుతమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ‘అహ్మదాబాద్ ఫ్లవర్ షో ఆకర్షణీయంగా ఉంది. మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఇది సృజనాత్మకతతోపాటు ప్రజల భాగస్వామ్యానికి అద్భుతమైన ఉదాహరణ. ఇది నగరం స్ఫూర్తిని, ప్రకృతి పట్ల ప్రేమను ప్రతిబింబించింది.’అని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈవెంట్ చిత్రాలను కూడా షేర్ చేశా రు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఫ్లవర్ షో విశేషాలను ఎక్స్‌లో పంచుకున్నారు.


