న్యూఢిల్లీ: కేవలం భర్త ఆర్థికంగా ఆధిపత్య ధోరణి కనబరుస్తున్నాడనే కారణంగా దాన్ని వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సాకులతో క్రిమినల్ కేసులు వేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. భర్త నుంచి కొంతకాలంగా దూరంగా ఉన్న ఓ మహిళ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. క్రూరత్వం, వరకట్న వేధింపుల ఆరోపణలతో భర్తపై పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది.
సదరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసేందుకు నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ‘‘మాజీ భర్త తాను పంపిన డబ్బులను ఎలా ఖర్చు చేసిందీ లెక్కలడిగాడన్నది పిటిషనర్ అభియోగం. అంతే తప్ప బాధితురాలికి ఇతరేతరా ఏ విధమైన మానసిక, భౌతిక హానీ జరగలేదు. అలాంటప్పుడు కేవలం మాజీ భర్త ఆర్థిక ఆధిపత్య ధోరణి చూపడాన్ని క్రూరత్వంగా పరిగణించలేం. ఇలాంటి వైవాహిక వివాదాల కేసుల విచారణలో కోర్టులు అత్యంత జాగరూకంగా వ్యవహరించాలి. ఒకరకంగా ఇది భారత సమాజ తీరుతెన్నులకు అద్దం పట్టే అంశం. పురుషులు స్త్రీల ఆర్థిక విషయాలపైనా తమ పెత్తనమే సాగాలనుకుంటూ ఉంటారు’’అని తీర్పు రాసిన జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు.


