బెంగళూరు: డిప్రెషన్. ఈ డిప్రెషన్‌లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


