తొమ్మిది రోజుల వ్యవధిలో మూడో ఘటన
డ్రోన్ కెమెరాలతో ముమ్మర గాలింపు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని కైసర్ గంజ్ ప్రాంతంలో మరోసారి తోడేలు దాడి ఘటన చోటుచేసుకుంది. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఓ తోడేలు నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. అటవీ సిబ్బంది, గ్రామస్తులు డ్రోన్ కెమెరాల సాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటన మల్లహన్‌పుర్వ గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. కిరణ్ సంతోష్ దంపతుల నాలుగు నెలల సుభాష్ తల్లి పక్కన నిద్రిస్తుండగా చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు నోట కరుచుకుని సమీపంలోని అడవిలోకి పరుగుతీసింది.
వెంటనే అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. లాభం లేకపోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్ కెమెరాలతో చిన్నారి జాడను కనుగొనేందుకు యతి్నస్తున్నారు. ‘గతంలో తోడేలు కనిపించినట్లు గ్రామస్తులు చెప్పిన నదీ సమీప ప్రాంతాలు, చెరకు తోటలు సహా అన్ని ప్రాంతాల్లోనూ మా బృందాలు గాలిస్తున్నాయి. శిక్షణ పొందిన షూటర్లను కూడా రంగంలోకి దించాం.
ఆ తోడేలును పట్టుకోవడమో లేదా చంపేయడమో చేస్తాం’అని డీఎఫ్‌వో రామ్ సింగ్ యాదవ్ చెప్పారు. కాగా, మల్లన్‌పుర్వ గ్రామంలో గత 9 రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడో ఘటన ఇది. నవంబర్ 28న ఐదేళ్ల బాలుడు స్టార్ తోడేలు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 5న మరో ఐదేళ్ల బాలిక తోడేలు దాడిలో గాయపడింది. సెపె్టంబర్ 9వ తేదీ నుంచి బహ్రెయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది చిన్నారులతోపాటు ఓ వృద్ధుడు చనిపోయారు. మరో 32 మంది గాయపడ్డారు. దీంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టారు. ఆయన ఆదేశాలతో షూటర్లు నాలుగు తోడేళ్లను కాల్చి చంపారు.


