బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 19 మంది మావోయిస్టులు మృతి చెందారని గురువారం అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మృతుల్లో ఓ అగ్రనేత ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు భద్రతా బలగాల సిబ్బంది కూడా అమరులయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
అయితే ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల లభ్యం.. కూంబింగ్ కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య 25 దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే.. మృతుల్లో పీఎల్‌జీఏ-2 కమాండర్ వెల్ల మోడియం కూడా ఉన్నారని భావిస్తున్నారు.
వెల్ల మోడియం (Vella Modiyam) మావోయిస్టు పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేత. దక్షిణ బస్తర్‌లో టాప్ కమాండర్ కూడా. ఆయనపై భారీగానే రివార్డు ఉంది. హిడ్మా తరహాలోనే వ్యూహాత్మక దాడులకు ఆయన నేతృత్వం వహించేవారు. ఒకానొక టైంలో.. హిడ్మా కంటే కూడా పెద్ద మావోయిస్టు నాయకుడిగా పోలీసులు, భద్రతా దళాలు భావించేవి. మోడియం ఎన్‌కౌంటర్ నిజమే అయితే.. నక్సలైట్లకు పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


