ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ‘మోస్ట్ వాంటెడ్’ మృతి
హిడ్మా భార్య రాజే, మరో నలుగురు మావోయిస్టులు కూడా..
అల్లూరి జిల్లా నెల్లూరు–ఇజ్జలూరు మధ్య తెల్లవారుజామున ఎదురుకాల్పులు
తప్పించుకున్న మరికొందరి కోసం ముమ్మరంగా కొనసాగుతున్న వేట
నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురి పెట్టిన పోలీసు బలగాలు
ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపణ
రంపచోడవరం,సాక్షి, అమరావతి: వరుసగా పలువురు అగ్రనేతల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో విలవిలలాడుతున్న మావోయిస్టులకు కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది! రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌చార్జ్‌హిడ్మాతో పాటు ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క, మరో నలుగురు మావోయిస్టులు దేవ్, లక్మల్ అలియాస్ చైతు, మల్ల అలియాస్ మల్లలు, కమ్లూ అలియాస్ కమలేశ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం నెల్లూరు–ఇజ్జలూరు మధ్య అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 6 నుంచి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఏవోబీ సరిహద్దుల్లో వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఘటన వివరాలను ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్హా, ఎస్పీ అమిత్‌బర్దర్ రంపచోడవరం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు వెల్లడించారు. సమావేశంలో రంపచోడవరం ఓఎస్డీ పంకజ్‌కుమార్ మీనా, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాశ్ పాల్గొన్నారు.
ఎన్‌కౌంటర్ ప్రాంతంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పిస్తోలు, రివాల్వర్, సింగిల్ బ్యారెల్ గన్‌తోపాటు 28 రౌండ్ల ఏకే 47 రైఫిల్స్ బుల్లెట్లు, 5 రౌండ్ల పిస్తోలు బుల్లెట్లు, ఖాళీ ఏకే 47, పిస్తోలు షెల్స్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు లడ్హా తెలిపారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 25 మీటర్ల ఫ్యూజ్ వైర్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్, ఏడు కిట్ బ్యాగులను కూడా స్వాదీనం చేసుకున్నామన్నారు. మరి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు భావిస్తున్నామని, వారి కోసం భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘటన వివరాలివీ..
నిఘా పక్కా సమాచారంతో..
ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా జరుగుతున్న పోలీస్ కూంబింగ్‌తో కొందరు మావోయిస్టులు ఆంధ్రాలోని మైదాన ప్రాంతం షెల్టర్ జోన్‌కు చేరుకోగా మరికొందరు అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. గత రెండుమూడు రోజులుగా మావోయిస్టుల కదలికలపై నిఘా విభాగం నుంచి కచ్చితమైన సమాచారం రావడంతో అల్లూరి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం వద్ద ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టి సుమారు 31 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా మరో 30 మంది కోసం గాలిస్తున్నారు. కాగా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపించింది.
ఆదివాసీ నేత.. గెరిల్లా యుద్ధతంత్రం..
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మడివి హిడ్మా 16 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరి అతి తక్కువ సమయంలోనే అగ్రనేతగా ఎదిగాడు. ఆదివాసీ వర్గానికి చెందిన హిడ్మాకు పలు భాషల్లో మంచి పట్టుంది. మావోయిస్టు అగ్రనేత రామన్న సారథ్యంలో గెరిల్లా యుద్ధతంత్రంలో హిడ్మా ఆరితేరారు. 2019లో రామన్న మృతి అనంతరం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి గెరిల్లా పోరుతో మెరుపు దాడులకు దిగి మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరాడు. పలు దాడులను స్వయంగా పర్యవేక్షించాడు.
హిడ్మా నేతృత్వంలో 2010 ఏప్రిల్‌లో చింతల్‌నార్ వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. 2013లో దర్భా ఘాట్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. 2017 బుర్కాపాల్ వద్ద మరోసారి మావోయిస్టుల దాడిలో 24 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘటనల వెనకహిడ్మా కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. హిడ్మాను లొంగుబాట పట్టించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారులు పూవర్తిలో ఉంటున్న ఆయన తల్లి ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు.
కర్రె గుట్టల్లో తృటిలో తప్పించుకుని..
ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం హిడ్మా టార్గెట్‌గా కర్రె గుట్టలను చుట్టుముట్టిన పోలీసులు నాలుగు రోజులపాటు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా తాజాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం గమనార్హం.


