మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు
గత ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టి ఆ పనుల కోసం రూ.990 కోట్లు ఖర్చు కూడా చేసింది
అయినా.. పర్యావరణ అనుమతి లేకుండానే సీమ ఎత్తిపోతలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది
ఎన్‌జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేశించింది
సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించేలా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని.. అందులో కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కేది 66 శాతం అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు.
ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్‌జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేÔ>లు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్‌జీటీ మళ్లీ విచారించి రూ.2.65 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చు వృథాగా జరిగినట్లు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వృథా అని అనడం లేదని కానీ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో 3 కొత్త రిజర్వాయర్లు..
గత ప్రభుత్వ హయాంలో జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్ట్ (అంచనా వ్యయం రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముదివేడు రిజర్వాయర్ (అంచనా రూ.500 కోట్లు, ఖర్చు రూ.167.97 కోట్లు), నేటిగుంటపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.571 కోట్లు, ఖర్చు రూ.494 కోట్లు), ఆవులపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.482 కోట్లు, ఖర్చు రూ.28 కోట్లు) అనే 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారన్నారు.


