గోవా నైట్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం జరిగి, 25 మంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, అందరి దృష్టి నైట్ క్లబ్‌ల వైపు మళ్లింది. ఇంతకీ నైట్ క్లబ్‌లలో ఏం చేస్తారు? ఎవరెవరు వెళుతుంటారు? అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి? ఏ వయసువారు వెళ్లవచ్చు? అక్కడ పాటించాల్సిన నిబంధనలేమిటి? వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు పలువురి మదిలో మెదులుతుంటాయి. వాటికి సమాధానమే ఈ ప్రత్యేక కథనం..
మరో ప్రపంచం..
అందరూ నిద్రలోనికి జారుకునే అర్ధరాత్రి వేళ.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మరో ప్రపంచం మేల్కొంటుంది. అదే నైట్ లైఫ్ కల్చర్.. ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. యువత.. తమలోని ఒత్తిడిని దూరం చేసుకునేందుకు, ఆనందం అందుకునేందుకు నైట్ లైఫ్ పేరిట ఒక ఆధునిక వేదికను ‘నైట్ క్లబ్’ల పేరిట ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం నైట్ క్లబ్ సంస్కృతి పట్టణ జీవనశైలిలో ఒక భాగంగా మారిపోయింది. సంప్రదాయ సంగీత ఉత్సవాలకు భిన్నంగా నైట్ లైఫ్ అనేది ఆధునిక, వేగవంతమైన ప్రపంచాన్ని చూపిస్తోంది. దీనిని వినోదం, ఉల్లాసం, సామాజిక కలయిక కోసం ఒక వేదికగా యువత భావిస్తోంది.

క్లబ్‌లలో కార్యక్రమాలివే..
నైట్ క్లబ్‌లలో అందించే ప్రధాన వినోదం డ్యాన్స్ ఫ్లోర్.. సంగీతం. దేశవ్యాప్తంగా ఉన్న పలు నైట్ క్లబ్‌లు ప్రధానంగా బాలీవుడ్ రీమిక్స్‌లు, ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్, హిప్ హాప్, పాప్ సంగీతానికి ప్రాధాన్యతనిస్తాయి. ప్రముఖ డీజేల ప్రత్యక్ష ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. కొన్ని ప్రత్యేకమైన క్లబ్‌లలో నిర్దిష్ట రోజులలో జానపద, జాజ్ లేదా ఫ్యూజన్ సంగీతంతో కూడిన ప్రత్యక్ష బ్యాండ్‌లను లేదా స్టాండప్ కామెడీ షోలను కూడా నిర్వహిస్తాయి. ఇక్కడ అందుబాటులో ఉండే పానీయాలు, లైటింగ్ షోలు ఈ వినోదానికి మరింత ఉత్సాహాన్ని జోడిస్తాయి.
ఏ వయసువారు వెళ్లొచ్చు?
నైట్ క్లబ్‌లలో ప్రవేశించడానికి అత్యంత కీలకమైన నిబంధన వయో పరిమితి. భారతదేశంలో మద్యం సేవించడానికి, క్లబ్‌లలో ప్రవేశించడానికి చాలా రాష్ట్రాలలో కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్ణయించారు. (కొన్ని రాష్ట్రాలలో 25 ఏళ్లు). ఈ వయస్సును ధృవీకరించేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ(ఐడెంటిటీ కార్డు) చూపించడం తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ వంటి పత్రాలు లేకుండా నైట్ క్లబ్‌లలోకి ప్రవేశం ఉండదు. చాలా క్లబ్‌లు ‘కపుల్ ఎంట్రీ’కి ప్రాధాన్యతనిస్తాయి. ఒంటరి పురుషులకు పలు క్లబ్‌లలో ప్రవేశం ఉండదు.

డ్రెస్ కోడ్..సమయ నిబంధనలు..
నైట్‌క్లబ్ సంస్కృతిలో డ్రెస్ కోడ్ ముఖ్యమైనదిగా మారింది. పలు నైట్‌క్లబ్‌లు ‘స్మార్ట్ క్యాజువల్’ లేదా ‘ఫార్మల్’ దుస్తులను ధరించి రావాలని ముందుగానే చెబుతాయి. స్లిప్పర్‌లు, అథ్లెటిక్ వేర్ తరహా దుస్తులకు అనుమతి ఉండకపోవచ్చు. ఈ నిబంధనలు నైట్‌లైఫ్ అనుభవాన్ని మరింతగా ఆస్వాదించేందుకు ఉపకరిస్తాయని నిర్వాహకులు చెబుతుంటారు. నైట్‌క్లబ్‌ల నిర్వహణపై ప్రభుత్వ నియంత్రణ చాలా కఠినంగా అమలవుతుంటుంది. దేశంలోని పలు నగరాల్లో నైట్ క్లబ్‌లు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల వరకే నిర్వహించాలనే నిబంధనలున్నాయి. ఈ నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానాలుంటాయి. వీటిలో ధ్వని కాలుష్య నిబంధనలు కూడా ఉన్నాయి. నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న క్లబ్‌లు రాత్రి 10 గంటల తర్వాత శబ్దం స్థాయిని తగ్గించాలి.
ఆర్థిక వ్యవస్థకు ఊతం
నైట్‌లైఫ్ కల్చర్ దేశ ఆర్థిక వ్యవస్థకు సాయమందిస్తుంది. పర్యాటక రంగం, ఆహార, పానీయాల పరిశ్రమకు ఆదాయాన్ని సమకూరుస్తుంది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంటుంది. డీజేలు, బౌన్సర్లు, బార్టెండర్లు, ఇతర సిబ్బందికి ఇదే ఆదాయమార్గంగా ఉంది. నైట్‌క్లబ్‌లనేవి ఒత్తిడితో కూడిన పట్టణ జీవితం నుండి బయటపడటానికి, ఉల్లాసాన్ని అందుకునేందుకు, వివిధ వర్గాలవారు ఒకచోట కలుసుకునేందుకు ఒక వేదిక అని చెబుతుంటారు. ఇదేవిధంగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి నైట్ క్లబ్‌లు ఒక సృజనాత్మక వేదికను అందిస్తాయి.
విమర్శలు.. వివాదాలు
నైట్‌క్లబ్‌ల వల్ల పలు ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. అతిగా మద్యం సేవించడం వల్ల భద్రతా సమస్యలు, డ్రగ్స్ వినియోగం, అర్థరాత్రి ఘర్షణలు మొదలైనవి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. నైట్‌లైఫ్ సంస్కృతిని కొందరు సంప్రదాయవాదులు భారతీయ విలువలకు విరుద్ధంగా భావిస్తారు. అలాగే నైట్ క్లబ్‌ల సమీపంలో నివసించే వారికి ధ్వని కాలుష్యం పెద్ద సమస్యగా పరిణమిస్తుంటుంది. ఈ ప్రతికూలతలను నియంత్రించేందుకు పోలీసుల నిరంతర పర్యవేక్షణ అవసరమవుతుంటుంది.
భవిష్యత్‌లో..
భారతదేశంలో నైట్‌లైఫ్ సంస్కృతి రానురాను పెరుగుతూ వస్తోంది. ముంబై తదితర నగరాల్లో నైట్ క్లబ్‌ల సమయ పరిమితులను మరింత సరళతరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నైట్‌లైఫ్‌ను కేవలం వినోదంగానే కాకుండా, పట్టణ సంస్కృతిలో ముఖ్యమైనదిగా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో మరింత కఠినమైన భద్రతా చర్యలు, లైసెన్స్ నిబంధనలు, పౌరుల బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నైట్‌లైఫ్ కల్చర్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కింగ్ చార్లెస్ సర్‌ప్రైజ్.. క్రిస్మస్ సందడి షురూ!


