సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఇద్దరు గల్లంతయ్యారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టేందుకు నదిలో దిగారు. ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు.. ఒకరిని కాపాడారు. మరో ఇద్దరు రోహిత్ కుమార్, నరేష్ గల్లంతయ్యారు. చిన్నచౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.
కోనసీమ జిల్లా: మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌లో విషాదం జరిగింది. సముద్రంలో స్నానానికి దిగి బాలుడు గల్లంతయ్యాడు. నలుగురు స్నేహితులు కలిసి స్నానానికి దిగగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన బాలుడిది సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంగా స్థానికులు గుర్తించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.


