ఇద్దరు విభిన్న ప్రతిభావంతుల మధ్య చిగురించిన ప్రేమ
పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించిన గణేష్
ఆపై ప్రియురాలిని చంపి నీవా నదిలో పడేసిన వైనం
నిందితుడు ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్.. జాతీయ క్రికెటర్
పోలీసుల దర్యాప్తు తీరుపై వైఎస్సార్‌సీపీ నేత ఆగ్రహం
చిత్తూరు అర్బన్/ గంగాధరనెల్లూరు: ఇద్దరు విభిన్న ప్రతిభావంతుల మధ్య చిగురించిన ప్రేమ చివరకు విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలు తనకన్నా పెద్దది కావడం.. ఆమెను వదిలించుకునే క్రమంలో ప్రియుడు కిరాతకంగా మారిపోయాడు. ఆమెను నిర్ధాక్షిణ్యంగా హత్య చేసి నీవానదిలో పడేశాడు. చిత్తూరులో నమోదైన అదృశ్యం కేసు హత్యగా పలుపు తిరిగింది. బుధవారం ప్రియురాలి మృతదేహాన్ని గంగాధర నెల్లూరులోని నీవానదిలో గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట బాలజీ కాలనీకి చెందిన కవిత విభిన్న ప్రతిభావంతురాలు. కాణిపాకం ఆలయంలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిస్తున్నారు. గత నెల 31వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కవిత సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె తమ్ముడు చిట్టిబాబు అన్ని చోట్లా వెదికాడు. జనవరి 1వ తేదీన చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. 2వ తేదీన కేసు నమోదు చేశారు.
ప్రియుడే హంతకుడు?
చిత్తూరులోని మిట్టూరు ఎస్‌బీఐలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరుగా విభిన్న ప్రతిభావంతుడు గణేష్(26) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కవిత, గణేష్ మధ్య పరిచయం పెరిగింది. ఈ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది. తనకన్నా కవిత వయస్సులో 12 ఏళ్లు పెద్దది కావడంతో.. ఆమెను వదిలించుకోవడానికి గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టిట్లు సమాచారం.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి చంపేశాడు!
కవితను పెళ్లి చేసుకుంటామని చెప్పిన గణేష్.. ఆమెను గత నెల 31న ఆటోలో గంగాధరనెల్లూరులోని ఠాణా వద్దకు రప్పించాడు. కొద్దిసేపు తరువాత గణేష్, కవిత మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. తీరా పెళ్లి చేసుకుంటామని నమ్మించి, తన మూడు చక్రాల స్కూటర్‌లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఓ ఇనుపరాడ్‌కు బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో.. గంగాధరనెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవానదిలోకి తోసేసి వెళ్లిపోయాడు. పోలీసులు గణేష్‌ను పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి విచారించినా, తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు తప్పుదారి పట్టించాడు. బుధవారం సాయంత్రం నీవానదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించిన ఆమె సోదరుడు చిట్టిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన గణేష్.. కవితను వాడుకుని వదిలించుకోవడానికే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
క్రికెటర్..బ్యాంక్ ఉద్యోగి
విభిన్న ప్రతిభావంతుడైన గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా రాణించి క్రీడా కోటాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. బలిష్టంగా ఉన్న ఇతను కవిత మృతదేహాన్ని అవలీలగా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల వైఫల్యమే కారణం
పోలీసుల వైఫల్యం వల్లే కవిత హత్య జరిగిందని.. దీనికి చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్‌సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన దుయ్యబట్టారు.
మా నిర్లక్ష్యం లేదు
సీఐ స్పందిస్తూ.. ‘సెల్ టవర్ల లొకేషన్లతో అడవుల్లో, బావులు, చెరువుల వద్ద కవితను వెదికాము. మూడు రాత్రులు మావాళ్లు, నేను నిద్రకూడా పోలేదు. ఆమె కుటుంబ సభ్యులు వాయిస్ మెసేజ్ మాకు ముందుగా ఇచ్చి ఉంటే కేసు త్వరగా ఛేదించేవాళ్లం. ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడాలేదు..’ అని నెట్టికంటయ్య పేర్కొన్నారు.


