సామాన్యుడు కోడి మాంసం తినే పరిస్థితి లేకుండా పోతోంది. చికెన్ ధర చుక్కలను తాకుతోంది. రెండు నెలల క్రితం కిలో రూ. 250 ఉండగా.. నెల క్రితం రూ. 180 పలికింది. క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం రూ. 320కు చేరింది. ఎన్నడూ లేని విధంగా ధర పలకడంతో చికెన్ ప్రియులు ముద్ద దిగక వాపోతున్నారు. కోడిగుడ్డు సైతం రూ.8 వరకు పలుకుతోంది. రోజురోజుకూ చికెన్, గుడ్లతోపాటు కూరగాలయ ధరలు కూడా పెరుగుతున్నాయి.
కారణమేంటి?
హేచరీస్‌కు సెలవులు ఇవ్వడం, చికెన్ చిక్స్‌లో సమస్య తలెత్తడంతో ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా చికెన్ ధర భారీగా పెరిగినట్లు ఆయా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాకాహారం వైపు చూస్తున్న సామాన్యుడు అక్కడా ధరల దెబ్బకు బెంబేలెత్తుతున్నాడు. చికెన్ ధరలతో పప్పు దినుసులు, కూరగాయల ధరలు పోటీ పడుతుండడంతో సామాన్యులకు పౌష్టికాహారం అందని పరిస్థితి ఏర్పడింది.
విక్రయాలు తగ్గాయ్..
మంగళగిరి నియోజకవర్గంలో కోడి మాంసం అమ్మే దుకాణాలు 500కు పైగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. గతంలో ఒక్కొక్క వ్యాపారి రెండు రోజులకు ఒకసారి టన్ను నుంచి 2 టన్నుల వరకు కోళ్లను దిగుమతి చేసుకునేవారు. ఆదివారం వస్తోందంటే 4 నుండి 5 టన్నులు దించుకొనేవారు. ప్రస్తుతం మాంసం ధర పెరగడంతో దుకాణాలు వెలవెలపోతున్నాయి. జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉందని పలువురు వ్యాపారులు తెలిపారు. కట్టర్‌కు రోజు రూ.వెయ్యి, కోళ్లను కోసేవారికి రూ.700 ఇవ్వాలి. ప్రతి రోజు మెయింటెన్స్ కింద రూ.2 వేలు నుంచి రూ. 3 వేలు పక్కకు తీయాలి. వ్యాపారాలు జరగక జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని నిర్వాహకులు చెప్పారు.
కూరగాయలదీ అదే దారి..
చికెన్ ధరలకు పోటీగా పండుగల నేపథ్యంలో కూరగాయలు, పప్పు దినుసుల ధరలు కూడా భారీగా పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి, బీట్‌రూట్, క్యారెట్ కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు చేరింది. కిలో కందిపప్పు రూ. 120 వరకు ఉంది.
మరింత పెరగొచ్చు...
కార్తికమాసం, జనవరి ఫస్ట్, సంక్రాంతి పండుగలు వరుసగా రావడం తెలిసిందే. పండుగల అవసరాల నేపథ్యంలో గ్రామీణ, పట్టణ అవసరాలకు సరిపడా కోళ్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీంతో అతి తక్కువ కాలంలోనే రూ. 320 నుంచి రూ. 360 వరకు కిలో స్కిన్‌లెస్ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. నాటు కోడి మాంసం కూడా కిలో కనిష్టంగా రూ. 750 నుండి రూ.వెయ్యి వరకు ఉంది. పల్లెల్లోని ప్రజలు సైతం ఫారంకోళ్ల మాంసంపైనే ఆధారపడుతున్నారు.


