- 20 టీఎంసీలే కదా.. దానికి అంత రాద్దాంతం ఎందుకని బాబు ప్రశ్న
ఆ నీళ్లతో లక్ష ఎకరాలు సాగు సాధ్యమట!
‘‘ఆ... ఏమవుతుంది? 20 టీఎంసీలే కదా? దానికే అంత పెద్ద రాద్ధాంతం చేస్తారా’’, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలివి. పద్నాలుగేళ్లకుపైగా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడంపై రాజకీయ నేతలే కాదు.. వ్యవసాయ, ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనిషి జీవితానికి అత్యంత ప్రాథమికమైన అవసరం నీరు అన్నది ఆయనకు తెలియదని కాదు కానీ.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించి రాయలసీమ ద్రోహి అనిపించుకోవాల్సి వస్తుందన్న భయంతో సమస్యను చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేసినట్టుగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఈ నేపథ్యంలో అసలు ఇరవై టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు సాక్షి.కాం ఒక ప్రయత్నం చేసింది. వివక్ష, పక్షపాతాలకు తావులేకుండా ఉండేందుకు ఇదే ప్రశ్నను కృత్రిమ మేధకు వేసింది. కృత్రిమ మేధ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది...
అంతకంటే ముందు అసలు 20 టీఎంసీల నీళ్ల లెక్క ఒక్కసారి చూద్దాం. ఇంగ్లీషులో వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులను క్లుప్తంగా టీఎంసీ అంటున్నాము. లెక్క ఏమిటంటే.. వందకోట్ల ఘనపుటడుగుల నీళ్లు. ఒక్కో ఘనపుటడుగులో 28.3 లీటర్లు. అంటే ఒక టీఎంసీ = 2831.68 కోట్ల లీటర్లు. ఇరవై టీఎంసీలంటే.. కొంచెం అటు ఇటుగా 56600 కోట్ల లీటర్లన్నమాట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఇంత మొత్తంలో నీళ్లు వాడుకోగలిగితే ఏమవుతుందంటే...
వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తే...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అందుకునే 20 టీఎంసీల నీటిలో అరవై శాతం అంటే 12 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుంటే ఎంత భూమి సాగు చేయవచ్చో తెలుసా? సుమారు 1.5 లక్షల ఎకరాలు! రాయలసీమ తరువాత అత్యంత కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లాకు ఈ నీరు చేర్చామనుకుందాం. ఎకరాకు సీజన్‌కు 12 లక్షల లీటర్లు అందించడం ద్వారా సుమారు లక్ష ఎకరాల్లో వరి, మిగిలిన నీటితో పత్తి, పప్పు ధాన్యాలు పండించవచ్చు. ఎన్ని రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుంచి, పేదరికం నుంచి బయటపడతాయో మనమే ఊహించుకోవచ్చు. పన్నెండు టీఎంసీల నీరు వ్యవసాయనికి కేటాయించగా మిగిలిన ఎనిమిది టీఎంసీలను తాగునీటికి, పరిశ్రమల అవసరాలకు వాడుకోవచ్చు.
చెరిసగం చేద్దాం...
మొత్తం 20 టీఎంసీల నీటలో వ్యవసాయానికి, పరిశ్రమలకు చెరి సగం నీళ్లు కేటాయించారనుకుందాం. పది టీఎంసీలతో సుమారు రెండు కోట్ల మందికి ఏడాది పొడవునా మంచినీరు ఇవ్వవచ్చు. విజయవాడ లాంటి నగరం ప్రస్తుతం రోజుకు 50 కోట్ల లీటర్లు ఖర్చవుతున్నట్లు అంచనా. 10 టీఎంసీలు విజయవాడకు మాత్రమే కేటాయిస్తే మూడేళ్లపాటు నీటి కొరత అస్సలు ఉండదు. ఇలా కాకుండా... కడప, అనంతపురం లాంటి రాయలసీమ పట్టణాలకు కేటాయిస్తే.. తాగునీటి అవసరాలు తీరడమే కాదు.. భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరుగుతుంది. తాగునీటికి పది టీఎంసీలు పోగా మిగిలిన నీటిలో ఆరు టీఎంసీలు సాగుకు, నాలుగు టీఎంసీలు తాగునీటికి ఇస్తే.. రాయలసీమ జిల్లాల్లో కనీసం యాభై వేల ఎకరాల్లో పచ్చని పంటలు పండుతాయి.

అందరికీ సమపాళ్లలో ఇస్తే...
సాగు, తాగు నీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు కూడా సమప్రాధాన్యం ఇచ్చి చూస్తే... ఎనిమిది టీఎంసీల సాగునీటితో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు లక్ష ఎకరాల్లో పండించవచ్చు. అదే సమయంలో కోటీ ఇరవై లక్షల మంది దాహార్తిని ఏడు టీఎంసీల నీటితో పూర్తి చేయవచ్చు. అలాగే 5 టీఎంసీలతో పారిశ్రామిక వృద్ధికి కారణం కావచ్చు. విశాఖపట్నం ఫార్మా, స్టీల్ పరిశ్రమలు ప్రస్తుతం రోజుకు పది కోట్ల లీటర్ల నీరు వాడుతున్నట్లు అంచనాలున్నాయి. ఐదు టీఎంసీల నీటితో ఏడాది పాటు ఈ అవసరాలు తీరతాయి.
రిజర్వాయర్ల రీఛార్జ్ కోసం...???
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఏటా ఇరవై టీఎంసీల చొప్పున అందే నీటిని నేరుగా వెలిగొండ, పెన్నా బేసిన్ లోని రిజర్యావర్లలో నింపామని అనుకుందాం. సుమారు 43 టీఎంసీల సామర్థ్యమున్న వెలిగొండ ప్రాజెక్టు సగం వరకూ నిండుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 600 గ్రామాలకు తాగునీటి నిరంతర సరఫరా సాధ్యమవుతుంది. బంగాళాఖాతంలోకి వృథాగా కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. నిత్యం కరవు కాటకాలతో సమస్యలు ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయి


