భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
పట్టించుకోని పాలకులు
కడప అగ్రికల్చర్ : నిత్యావసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్‌లో జనాలకు దడ పుట్టిస్తున్నాయి. ప్రతి నిత్యం వినియోగించే నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో కొనుగోలు చేసే చోట అర కిలో కొనుగోలు చేసి సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లతీయాలని వారు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు.
ఆకాశాన్నంటిన వేరుశనగ విత్తనాలు
మొన్నటి వరకు కిలో రూ.120 ఉన్న వేరుశనగ విత్తనాల ధర అమాంతంగా పెరిగి అకాశాన్నంటింది. ప్రస్తుతం కిలో రూ.180 పలుకుతోంది. ఒక్క సారిగా కిలోపైన 60 పెరగడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు గణనీయంగా తగ్గింది. రబీ సీజన్‌కు సంబంధించి వేరుశనగ సాధారణ సాగు 5079 హెక్టార్లు కాగా ఈ ఏడాది రబీలో 2192 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సాగు సగానికి పైగా తగ్గడం కూడా ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
కంది బేడలు, మినుములు అంతే..
ఉమ్మడి కడప జిల్లాలో కంది బేడలు, మినుముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు కందులు కొని పçప్పు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది సామాన్యులు కూడా అన్ని కూరల కంటే పప్పును ఎక్కువగా చేసుకునేందుకు ఇష్టపడతారు. కానీ కంది బేడల ధర పెరగడంతో.. పçప్పు కూడా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే మినుముల ధర పెరగడంతో సామన్యులకు భారంగా మారింది. మొన్నటి వరకు కిలో రూ.120 ఉన్న కందిబేడలు ప్రస్తుతం 135కు చేరాయి. మినుములు కిలో 105 ఉండగా రూ.115కు చేరాయి.
సలసల కాగుతున్న నూనెలు
ప్రస్తుతం ఏ నూనె ధర చూసినా సలసల కాగుతోంది. మొన్నటి వరకు పామాయిల్ కిలో 115 ఉండగా ప్రస్తుతం కిలో 143కి చేరింది. చాలా మంది సామాన్యులు పామాయిల్‌నే ఎక్కువగా వాడతారు. అలాంటిది పామాయిల్ ధర కూడా పెరగడంతో అల్లాడుతున్నారు. ఇక వేరుశనగ నూనె గురించి చెప్పనవసరం లేదు. మొన్నటి వరకు కిలో 165 ఉండగా 180కి చేరింది. అలాగే సన్‌ఫ్లవర్ 165 నుంచి 185కి పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ధరలు ఇప్పటికి ఇప్పుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదని పలువురు వ్యాపారులు తెలుపుతున్నారు. దీంతో ప్రజలు భయపడుతున్నారు.
ధరలు చూస్తే భయం వేస్తోంది
బజారులో నిత్యావసర సరుకుల ధరలు వింటే భయమేస్తోంది. సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరూ వాడుకునే కంది పప్పు ధర కిలో మీద 15 రుపాయల పైన పెరిగింది. దీంతో సామాన్యుల నుంచి పెద్దవారి వరకు ఇబ్బందులు పడాల్సిందే. ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. – కొండారెడ్డి, సుంకేసుల, ఖాజీపేట మండలం
సామాన్యులకు పెనుభారం
నూనెల ధరలు అమాంతంగా పెరిగాయి. ఇది సామాన్యులకు కడుభారంగా మారింది. దీంతో పండుగలు పబ్బాలు కూడా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యులు బతికే పరిస్థితి లేదు. పామాయిల్ నుంచి వేరశనగ నూనె, సన్‌ఫ్లవర్ నూనెలు భారీగా పెరిగాయి. దీంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. – శివరామిరెడ్డి, ఆదినిమ్మాయపల్లె, వల్లూరు మండలం


