ఆశల వల.. 'చిక్కి విలవిల' | Share market betting apps are attracting the youth | Sakshi
Sakshi News home page

ఆశల వల.. 'చిక్కి విలవిల'

Feb 25 2026 5:50 AM | Updated on Feb 25 2026 5:50 AM

Share market betting apps are attracting the youth

యువతను ఊరిస్తున్న షేర్‌ మార్కెట్‌...బెట్టింగ్‌ యాప్స్‌ 

తెలిసీ తెలియకుండానే యాప్స్‌ ద్వారా లావాదేవీలు 

షేర్‌ మార్కెట్‌లో ఎఫ్‌అండ్‌ఓ ఆడుతూ భారీగా నష్టపోతున్న వైనం 

లాభాల ఆశతో పెట్టుబడి కోసం దొరికిన చోటల్లా అప్పులు  

ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్‌ యాప్స్‌లోనూ రూ.లక్షలు లాస్‌  

దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు..తల్లిదండ్రులకు గర్భశోకం  

పుట్టపర్తి: వాళ్లంతా చదువుకున్న వాళ్లే..ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆరితేరిన వారే. కానీ ఆశల వలకు చిక్కి విలవిల్లాడుతున్నారు. నిమిషాల్లో వేలు, లక్షలు సంపాదించాలని ఉన్నదంతా పోగొ ట్టుకుంటున్నారు. కొందరు షేర్‌ మార్కెట్‌పై అవగాహన లేక అత్యాశకు పోయి నష్టాలపాలవుతుండగా... మరికొందరు మాత్రం తాహతుకు మించి బెట్టింగ్‌లు వేస్తూ జీవితాలను పందేలకు అప్పగిస్తున్నారు. అంతిమంగా కుటుంబానికి అండగా ఉండాల్సిన వారు.. భారంగా మారుతున్నారు. మరికొం దరు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తల్లిదండ్రులకు మానసికక్షోభ మిగులుస్తున్నారు.  

అసలేమీ తెలియకుండానే... 
చాలా మంది యువత ఇప్పుడు తమ స్నేహితులు, తెలిసిన వారు చెప్పిన మాటలను తలకెక్కించుకుంటున్నారు. ముఖ్యంగా షేర్‌ మార్కెట్‌ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే సెల్‌ఫోన్‌లో ఏదో ఒక బ్రోకరేజీ సంస్థ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుబడి పెడుతున్నారు. అయితే తెలియని తనంతో  ఎఫ్‌అండ్‌ఓ (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌) ఆడుతుండటంతో రోజుల వ్యవధిలోనే ఉన్నదంతా ఊడ్చుకుపోతుండగా...పోయినదాన్ని తిరిగిరాబట్టుకోవాలన్న లక్ష్యంతో అప్పులు చేస్తున్నారు. 

ఇక బెట్టింగ్‌ యాప్స్‌ బారిన పడుతున్న వారి సంఖ్య కోకొల్లలు. అబ్బే మేము బెట్టింగ్‌ జోలికే వెళ్లమంటూ బయటకు చెప్పినా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసి రోజూ వేలల్లో బెట్టింగ్‌ వేస్తున్నారు. ఇలాంటి వారంతా ఎక్కువగా ఒంటరిగా గడుపుతూ స్నేహితులకు దూరంగా ఉంటుంటారు. ఈక్రమంలో ఏదైనా ఇబ్బంది  తలెత్తినా కనీసం మాట సాయం చేసే వారే కనిపించని పరిస్థితుల్లో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

స్నేహితులతో గడపాలి 
నేటి యువత ఆన్‌లైన్‌ గేమ్స్, షేర్‌ మార్కెట్‌లోనూ ఎక్కువగా విపరీతమైన పోకడలకు ఆకర్షితులవుతున్నారు. దీంతో భారీగా డబ్బు లు పోగొట్టుకోవటంతో పాటుజీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి మొదట సెల్‌ఫోన్‌ను దూరం ఉంచాలి. ఒంటరిగా ఉండకుండా మనుషుల మధ్య ఉండే విధంగా చూడాలి. ఎక్కువగా వారి బాగుకోరే స్నేహితులతో గడిపేలా చూడాలి. తద్వారా డబ్బు పోగొట్టుకుని డిప్రెషన్‌కు గురైనా వెంటనే తేరుకుంటారు.  – ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్యుడు, అనంతపురం 

యువతను చైతన్యవంతం చేస్తున్నాం 
నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. కొందరు మంచి మార్గంలో పయనిస్తుండగా.. మరికొందరు ఈజీ మనీ కోసం ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్‌ యాప్స్‌ బారిన పడుతున్నారు. దీనివల్ల వారు నష్టపోవడమే కాకుండా కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. బెట్టింగ్, ఇతర యాప్స్‌ల వినియోగం లేకుండా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు యువతకు హిత బోధ చేయాలి. పోలీసు శాఖ తరఫున ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏది మంచి... ఏది కాదో తెలియజెపుతూ యువతను చైతన్యవంతం చేస్తున్నాం.     – సతీష్‌ కుమార్, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement