న్యూస్‌మేకర్
‘అందరూ ఉద్యోగాలు చేస్తే ఊరిని ఎవరు ఉద్ధరిస్తారు’ అని ప్రశ్నించుకుంది సాక్షి రావత్. అందుకే బీటెక్ చేసి ఉద్యోగం చేయకుండా 22 ఏళ్ల వయసులో తన ఊరికి సర్పంచ్‌గా ఎన్నికైంది. ‘ఉత్తరాంచల్’ మొత్తానికి ఈ వయసులో సర్పంచ్ అయిన వాళ్లు లేరు. ‘చదువుకుంటున్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఊరు బాగుపడుతుంది’ అంటున్న సాక్షి రావత్ పరిచయం.
పల్లెలో పుట్టి పెరిగిన యువత చదువు పూర్తి కాగానే పట్టణాలకు చేరి ఉపాధి వెతుక్కుంటారు. ఆ తర్వాత ఏ పండగకో, సెలవులకో ఊరికి వచ్చి, ఊరి వారిని పలకరించి, ఇంట్లో వారితో గడిపి తిరిగి పట్టణాలకు చేరుకుంటారు. అనేక సందర్భాల్లో జరుగుతున్నది ఇదే. ఉద్యోగ, ఉపాధి మార్గాల అన్వేషణలో యువత పట్టణాలకు చేరుతుండటంతో పల్లెలు బోసిపోతున్నాయి. అటువంటి చోట కొత్త అంకురమై నిలిచారు 22ఏళ్ల సాక్షి రావత్. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వల్ జిల్లా ‘కుయీ’ గ్రామానికి ఈమె అతి చిన్నవయసులో గ్రామ ప్రధాన్ (సర్పంచి)గా మారారు. దేశంలో ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో ఒకరిగా వార్తల్లో నిలిచారు.
బాల్యం నుంచే సామాజిక అవగాహన
ఉత్తరాఖండ్ పౌరీ గఢ్‌వాల్ జిల్లాలో యువత లక్ష్యం ఒక్కటే... ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లి ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవడం. అక్కడ ఉంటూ ఊరికి అతిథుల్లా మారిపోవడం. ఈ పరిస్థితిని చిన్ననాటి నుంచి గమనిస్తోంది సాక్షి. ఆమె ఆ గ్రామంలో పుట్టి పెరిగింది. చిన్ననాటి నుంచి సామాజిక అంశాలను అర్థం చేసుకోవడం, దానిగురించి చర్చించడం, ఇతరులకు చేతనైన సాయం అందించడం ఆమెకు అలవడింది. అందుకు ఆమె కుటుంబం ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో బీటెక్ బయో టెక్నాలజీ పూర్తి చేసిన ఆమెకు మరేదో నగరానికి వెళ్లి ఉద్యోగం చేయాలని అనిపించలేదు. తను పుట్టి పెరిగిన ఊరికి తనవంతుగా ఏదైనా చేయాలని అనుకుంది.
యువత రాజకీయాల్లోకి రావాలంటూ..
పల్లెల్లో ఉపాధిమార్గాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చదువుకున్న వారికి అక్కడ దొరికే ఉద్యోగాలు దాదాపు శూన్యం. దీంతో వారంతా దూరంగా వెళ్లి బతకాల్సి వస్తోంది. దీనికితోడు స్థానికంగా మహిళలకు ఉపాధి లేక కుటుంబాలు పేదరికంతో మగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తేవాలంటే యువత రాజకీయాల్లోకి రావడం అవసరం అని సాక్షి భావించింది. అందుకు తొలి అడుగు తనదే కావాలని నిశ్చయించుకుంది. 21 ఏళ్లు దాటిన వ్యక్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న నిబంధనను అనుసరించి పోటీ చేసింది. చదువుకున్న అమ్మాయి. పైగా చిన్ననాటి నుంచి తోటివారి కోసం పాటు పడే తత్వం, ఊరి బాగు కోసం ఆలోచించే యుక్తి ఉన్న అభ్యర్థి కావడంతో అందరూ కలిసి సాక్షిని గెలిపించారు. తమ ఊరికి నాయకురాలిగా ఎన్నుకున్నారు.
ఇది కొత్త ప్రయాణం కాదు
‘ఇది ఇవాళ కొత్తగా మొదలైన ప్రయాణం కాదు. ఎన్నో ఏళ్లుగా నాలో నాటుకున్న భావన. నా ఊరికి ఏదైనా చేయాలి. నా ఊరి పరిస్థితులను మార్చాలి’ అంటున్నారు సాక్షి రావత్. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించడం, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం, విద్యార్థులకు విద్యాబోధన సౌకర్యాలు పెంచడంపై దృష్టి సారిస్తానని అంటున్నారు. తను చదివిన బయో టెక్నాలజీ అనుభవంతో రైతులతో కలిసి వ్యవసాయ పద్ధతుల్లో నూతన రీతుల్ని ప్రవేశపెట్టాలని ఉందని అంటున్నారు. ‘సొంత ఊరిని, కన్నతల్లిని విడిచిపెట్టడం ఎక్కడో దూరంగా బతకడం ఎవరికైనా కష్టమైన విషయమే. మా ఊళ్లో ఈ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. దానికి అడ్డుకట్ట వేయాలన్నదే నా ప్రణాళిక. అందుకు తగ్గ ఆలోచనలు నాకున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, వారి సమస్యలు తీర్చడం, ఆదాయ మార్గాలు పెంచడంపై దృష్టి నిలుపుతాను’ అని నమ్మకంగా చెప్తున్నారు సాక్షి.
తను చదివిన బయో టెక్నాలజీ అనుభవంతో రైతులతో కలిసి వ్యవసాయ పద్ధతుల్లో నూతన రీతుల్ని ప్రవేశపెట్టాలని ఉందని అంటున్నారు సాక్షి రావత్.


