లండన్: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలకు సిద్ధమవుతోంది. షాపింగ్ సెంటర్లు, వీధులు, ఇళ్లు క్రిస్మస్ లైట్లు, అలంకరణలు పండుగ థీమ్‌లతో మెరిసిపోతున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్ దేశాధినేత, కామన్వెల్త్ దేశాల అధిపతి కింగ్ చార్లెస్ అతని సతీమణి క్వీన్ కెమిల్లాలు తమ 2025 అధికారిక క్రిస్మస్ కార్డును విడుదల చేసి, పండుగ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించారు.
ఈ కార్డులో క్రిస్మస్ నేపథ్యానికి బదులుగా, ఈ జంట ఇటీవల ఇటలీ సందర్శన సందర్భంగా తీసిన ఫొటో ఉంది. ఇది ఫోటోగ్రాఫర్ క్రిస్ జాక్సన్ తీసిన ఈ చిత్రం. రోమ్‌లోని విల్లా వోల్కోన్స్కీలో కింగ్ చార్లెస్ (77), క్వీన్ కెమిల్లా (78)లు ప్రశాంత వదనంతో ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. గత ఏప్రిల్‌లో వారి 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోటో తీశారు. ఈ ఫొటోలో క్వీన్ కెమిల్లా.. అన్నా వాలెంటైన్ రూపొందించిన తెలుపు,లేత గోధుమ రంగు కోటు ధరించి కనిపిస్తుండగా, కింగ్ చార్లెస్ నీలిరంగు చారల సూట్‌లో హుందాగా కనిపిస్తున్నారు. కార్డు లోపల ఈ జంట తమ హృదయపూర్వక సందేశాన్ని ‘మీకు హ్యాపీ క్రిస్మస్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలియజేస్తూ సంతకాలు చేశారు.
2005లో వివాహం చేసుకున్న ఈ రాజ దంపతులు, తమ 20 ఏళ్ల బంధాన్ని ఇటలీలో జరుపుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు, వారు పురాతన రోమన్ ఆక్వా క్లాడియా దగ్గర తీయించుకున్న ఫోటోలను విడుదల చేశారు. 20 సంవత్సరాల తమ వైవాహిక జీవన మైలురాయి గురించి క్వీన్ కెమిల్లా మాట్లాడుతూ, తమ బంధం అపురూపమైనదన్నారు. ఈ క్రిస్మస్ కార్డు కేవలం శుభాకాంక్షలను మాత్రమే కాకుండా, ఈ రాజ దంపతుల మొదటి పర్యటన, వారి 20 ఏళ్ల వివాహ బంధంలోని మధుర స్మృతులను తెలియజేసింది.
ఇది కూడా చదవండి: ఈయన క్లబ్‌లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్ బ్యాక్‌గ్రౌండ్


