ట్రంప్‌తో బ్రిటన్ యువరాజు విలియం భేటీ అయ్యే ఛాన్స్
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అమెరికాలో చర్చలు!
లండన్: అమెరికా, బ్రిటన్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంలో స్వయంగా బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 మధ్యవర్తిత్వం వహించనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. తండ్రి ఛార్లెస్‌తోపాట బ్రిటన్ యువరాజు విలియం సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయి బ్రిటన్ తరఫున మంతనాలు జరిపే అవకాశముంది. బ్రిటన్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారే లక్ష్యంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఛార్లెస్ అమెరికాలో పర్యటించనున్నారు.
అదే నిజమైతే గత 20 ఏళ్లలో అమెరికాలో అడుగుపెడుతున్న తొలి బ్రిటన్ రాజపాలకుడిగా చార్లెస్ రికార్డ్‌సృష్టించనున్నారు. వాణిజ్య చర్చల్లో ఛార్లెస్, విలియం ప్రమేయాన్ని ఉటంకిస్తూ ‘ది టైమ్స్’ ఒక కథనం ప్రచురించింది. వచ్చే ఏడాది జులైలో కెనడా, మెక్సికోలతో సంయుక్తంగా అమెరికా ప్రపంచ ఫుట్‌బాల్ కప్ మ్యాచ్‌లను నిర్వహించనుంది. వాటిని తిలకించేందుకు విలియం అమెరికాలో పర్యటించనున్నారు.
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఛార్లెస్, విలియం పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చేందకు జరిగే కీలక చర్చల్లో తండ్రీకొడుకులు భాగస్వాములుగా మారతారని సమాచారం. అయితే విలియం, ఛార్లెస్‌లకు ఇంకా అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ఆహ్వానాలు అందలేదు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో ట్రంప్ పర్యటించినప్పుడే బ్రిటన్‌లోకి 31 బిలియన్ పౌండ్ల పెట్టుబడిపై ఆశలు చిగురించాయి. కానీ బ్రిటన్‌లో కఠినతర ఆన్‌లైన్ భద్రతా నిబంధనలు, డిజిటల్ సేవా పన్ను, ఆహార భద్రతలో కఠిన నిబంధనలతో బ్రిటన్ సాంకేతిక రంగంలో ప్రతిపాదిత బిలియన్ డాలర్ల పెట్టుబడులపై ఈ నెలలోనే అమెరికా ప్రభుత్వం మోకాలడ్డింది. మా రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని బ్రిటన్ చెబుతుండగా అమెరికా రైతులకూ అవకాశం ఇవ్వాలని ట్రంప్ సర్కార్ అభ్యర్థిస్తోంది.


