‘బాబ్రీ’లాంటి మసీదు నిర్మిస్తాననడంపై టీఎంసీ సీరియస్
ఆయన్ను ద్రోహిగా పేర్కొన్న సీఎం మమతా బెనర్జీ
బహరాంపూర్: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు వంటి మసీదు నిర్మాణాన్ని ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తానంటూ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6వ తేదీని పురస్కరించుకుని దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొనడాన్ని అధికార టీఎంసీ సీరియస్‌గా తీసుకుంది. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే, కబీర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేయాలని చూసినా తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతానన్నారు.
టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కబీర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ద్రోహిగా అభివరి్ణంచారు. ప్రతి మతంలోనూ ద్రోహులున్నారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడమే వీరి పని అని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు పాల్పడుతున్న కబీర్‌పై టీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇక నుంచి ఆయనతో టీఎంసీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మసీదును ఎవరైనా నిర్మించొచ్చు. అదే సమయంలో మత పరంగా రెచ్చగొట్టడం తగదు. బాధ్యతాయుతంగా వ్యవహరించే మా పార్టీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు’అని ఆయన తెలిపారు.


