భాగ్యనగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. అయినా సరే.. ఆ కార్మికుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
42 ఏళ్ల వయసున్న నవీన్ కుమార్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడి శరీరం నుంచి రెండు ఇనుప రాడ్లను తొలగించాల్సి ఉంది. అప్పటికే అతడు స్పృహ కోల్పోయాడు, అతడి రక్తపోటు కేవలం 50/30 మాత్రమే ఉంది. ఇక ఆక్సిజన్ శాచ్యురేషన్ అయితే కనీసం లెక్కలకు కూడా అందనంత తక్కువగా ఉంది. అతడి హృదయం వద్ద పెద్ద గాయం ఉండడం, అందులోంచి గుండె, ఊపిరితిత్తులు కూడా కనిపిస్తుండడం, దాదాపు 2-3 లీటర్ల వరకు రక్తం పోవడం, ఊపిరితిత్తులకు-ఛాతీ గోడకు మధ్య రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు రంధ్రం పడడం... ఇన్ని సమస్యలు అతడికి ఉన్నాయి.
ముందు అత్యవసరంగా అతడిని వెంటిలేటర్ మీద పెట్టారు. శరవేగంగా రక్తం ఎక్కించి, రీససిటేషన్ చేశారు. గాయం చాలా పెద్దగా ఉన్నట్లు సీటీ స్కానింగ్‌లో తెలిసింది. దాంతో వెనువెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. వైద్యులు అతడికి అత్యవసరంగా థొరకాటమీ శస్త్రచికిత్స చేశారు. అతడి ఎడమ ఊపిరితిత్తిలోని శ్వాసకోశం పూర్తిగా ధ్వంసమైపోయింది.
దాంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండడంతో నవీన్ రక్తపోటు మరింతగా పడిపోసాగింది. ఫలితంగా రక్తం మరింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తుండడంతో దాన్ని రక్షించేందుకు వెంటిలేషన్ వ్యూహాలను అమలుచేశారు. అతడికి ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతున్నా కూడా మెదడు, ఇతర కీలక అవయవాలు ఏవీ దెబ్బతినకుండా వైద్యబృందం చాలా కష్టపడింది.
ఈ కేసు సంక్లిష్టత గురించి అమోఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ట్రామా కేసు. నవీన్‌కు తగిలిన గాయాలన్నీ ప్రాణాంతకమే. ప్రతి నిమిషం చాలా విలువైనది.
దాంతో మా అత్యవసర, సర్జికల్, ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల్లోని వైద్యులందరూ అద్భుతమైన సమన్వయంతో పనిచేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రపంచస్థాయి ట్రామాకేర్ సదుపాయాలు, సరైన సమయానికి చికిత్స అందించాం అనడానికి అతడి ప్రాణాలు నిలబడడమే నిదర్శనం. ఇప్పుడతడు కోలుకుని సాధారణ జీవితం గడపడం మాకెంతో ఆనందాన్నిస్తోంది” అని తెలిపారు.
నవీన్ చాలా అద్భుతంగా కోలుకోవడంతో, 48 గంటల్లోనే వెంటిలేటర్ తొలగించారు. కాసేపటి తర్వాత అతడు ఒకరి సాయంతో నడవగలిగాడు. వారం రోజుల్లోపే అతడు ఎలాంటి సాయం అవసరం లేకుండా తన కాళ్ల మీద తాను నడుస్తూ కోలుకోవడంతో డిశ్చార్జి చేశాం.
అతడికి చికిత్స చేసిన వైద్యబృందంలో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ పూజిత, ఎమర్జెన్సీ బృందానికి చెందిన డాక్టర్ నందీప్, డాక్టర్ అశోక్, క్రిటికల్ కేర్ విభాగ నిపుణులు డాక్టర్ ప్రత్యూష, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ జగదీష్ కీలకంగా వ్యవహరించారు.
(చదవండి: మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!)


