1967 డిసెంబర్ 3: ప్రపంచంలో తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స
నేడు ప్రపంచ వైద్య చరిత్రను మలుపు తిప్పిన రోజు. మొదటి సారిగా ఒక మనిషి గుండెను మరో మనిషికి అమర్చిన దినం! మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ చికిత్స దక్షిణా ఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగింది. ఆపరేషన్ నిర్వహించింది అమె రికాలో శిక్షణ పొందిన డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. రోడ్డు ప్రమాదంలో తలకు గాయం తగిలి బ్రెయిన్ డెడ్ అయిన డెనిస్ డెర్వల్ అనే 25 ఏళ్ళ యువతి గుండెను లూయిస్ వాష్కా¯Œ స్కీ అనే 53 ఏళ్ళ వ్యాపారికి అమర్చారు.
అతనికి గుండె జబ్బు తీవ్రంగా ఉండి, ఏ మందులతోనూ బతక లేడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది (1967 డిసెంబర్ 3). ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కానీ 18 రోజులకే పేషెంట్ మరణించాడు. రోగ నిరోధక వ్యవస్థను అణచడానికి ఇచ్చిన మందులు సరిగా పని చేయకపోవడంతో న్యుమోనియా వచ్చి అతడు మరణించాడు. ఈ ఘటన తర్వాత ప్రపంచం మొత్తం హార్ట్ సర్జరీ, అవయవ మార్పిడి, వైద్యపరమైన నైతికత, మరణానికి నిర్వచనం, రోగుల హక్కుల వంటి అనేక విషయాలను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది.

1960వ దశకంలో గుండె శస్త్రచికిత్సలు చాలా అభివృద్ధి చెందాయి. హార్ట్–లంగ్ మెషీన్, బైపాస్ టెక్నిక్, మూత్రపిండ మార్పిడి అనుభవాలు గుండె మార్పిడి దిశగా వైద్య రంగాన్ని తీసు కెళ్లాయి. అయినా కూడా ‘మనిషి గుండెను తీసి మరొకరి గుండె పెట్టడం’ అనేది ఆశ్చర్యకరమైన, ధైర్యంతో కూడిన, భయానక మైన ఆలోచన. గుండెను ఒక మనిషి ప్రాణంగా; భావాలు, వ్యక్తిత్వం వంటివాటికి ప్రతిరూపంగా చూడటం వల్ల గుండె మార్పిడి పెద్ద సవాలుగా మారింది.
ఈ సర్జరీ మానవ వైద్య చరిత్రలో విప్లవం అనడం అతిశ యోక్తి కాదు. జంతువులపై చేసిన ప్రయోగాలన్నీ మానవ శరీరంపై కూడా చేసి విజయం సాధించవచ్చని స్పష్టం అయింది. ఇమ్యూనాలజీని అభివృద్ధి చేయడం, అవయవ నిరాకరణ వంటివి ఆనాటి పెద్ద సమస్యలు. వాష్కాన్‌స్కీ కేసు తర్వాత మంచి ఇమ్యూ నోసప్రెషన్ మందుల అవసరం పెరిగింది. ఇది తర్వాత సైక్లోస్పో రిన్ వంటి శక్తిమంతమైన మందుల అభివృద్ధికి దారితీసింది. ఈ కేసు తర్వాత బ్రెయిన్ డెత్‌ను లీగల్‌గా అంగీకరించడం ప్రారంభ మైంది. ఇది అవయవ దానం అభివృద్ధికి కీలకంగా మారింది. ఈ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ హృదయ మార్పిడి ప్రయత్నాలు జరిగాయి. వైద్య కళాశాలల్లో ట్రాన్స్‌ప్లాంట్ మెడిసిన్‌కు ప్రత్యేక శిక్షణ మొదలైంది.
అయితే నైతికపరమైన ప్రశ్నలు కొన్ని తలెత్తాయి.
అప్పట్లో ‘బ్రెయిన్ డెడ్’ అనే నిర్వచనం ఇప్పటిలా లేదు. వెంటిలేటర్ తీసేసి, పొటాషియం ఇంజెక్షన్ ఇచ్చి డెనిస్ గుండెను ఆపేశారు. ఇది చాలా మంది డాక్టర్లకు ‘దాతను చంపి గుండె తీసినట్టు’ అని పించింది. రోగి, దాత కుటుంబాలకు శస్త్రచికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా రోగికి ‘మీరు బతికే ఛాన్స్ చాలా తక్కువ’ అని స్పష్టంగా చెప్పలేదనీ అంటారు. ప్రచారం కోసం రోగి జీవితంతో ఆటలాడారనీ అన్నారు. అమెరికా కంటే తామే ముందు ఇటువంటి శస్త్రచికిత్స చేశామనే ప్రచారం కోసం అప్పట్లో జాతి వివక్ష అమలులో ఉన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ సర్జరీని వాడుకోవడమూ గమనార్హమే. విమర్శలు ఎన్ని వచ్చినా, గుండెమార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుత మైన ప్రగతి సాధించడానికి బర్నార్డ్ ధైర్యంగా నిర్వహించిన సర్జరీ పునాదిగా నిలిచింది. ఇప్పుడు ఈ చికిత్స చేయించుకున్నవారు 20 నుంచి 30 ఏళ్లు బతకడం ఇందుకు నిదర్శనం.


